
2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ కోసం బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఆ పార్టీ ముఖ్యనాయకులతో కలిసి మూడు బృందాలు ఏర్పాటు అయ్యాయి. ఈ బృందాలు మంగళవారం నుంచి తన సన్నాహాలను ప్రారంభించింది. ఇవి ఏప్రిల్ 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తాయి.
ఇందులో ఒక టీమ్‌లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, రాష్ట్ర ఇన్‌చార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇతర రెండు జట్లకు నాయకత్వం వహిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో కూడిన ప్రతీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లి భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యకలాపాలను సమీక్షిస్తుంది.
ఈ సందర్భంగా సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం మంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముందు ప్రతీ జిల్లాలో బూత్ స్థాయి నుంచి వివిధ మోర్చాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీ నేతలకు సంస్థాగత లక్ష్యాలను నిర్దేశించామన్నారు. కోస్తా ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో, అంకితభావంతో పని చేస్తున్నారని అన్నారు. దీంతో పార్టీ బలపడుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో కోస్తాంధ్రలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.
హిందుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి నివేదిక పేరు చెప్పి బీజేపీ ఎన్నికలలో పోరాడుతుందా అనే ప్రశ్నకు బొమ్మై సమాధానమిస్తూ.. “ మా ప్రభుత్వ అభివృద్ధి పనుల ఆధారంగా మేము ఎన్నికలను ఎదుర్కొంటాము. మత్స్యకారుల సంక్షేమం, కమ్యూనిటీ అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, మా పార్టీ కార్యకర్తల కృషి వల్ల పార్టీ మెరుగవుతోంది. ’’ అని అన్నారు.
ఉత్తర కర్ణాటకలో పర్యటిస్తున్న కర్ణాటక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటకలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప రూపంలో పార్టీకి బలమైన నాయకత్వం, మార్గదర్శకత్వం ఉంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ’’ అని ఆయన అన్నారు. కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ప్రారంభంలో కర్ణాటకకు వచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 224 స్థానాల్లో బీజేపీ 150కి పైగా స్థానాలు సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఎన్నికల విషయంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు పార్టీ పర్యటనలు చేపడుతోందని అన్నారు. దీంతో ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి కూడా ఈ పర్యటన షెడ్యూల్ ను రూపొందించామని అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలోని పార్టీ పని తీరుకు సంబంధించిన అభిప్రాయాలను ఎమ్మెల్యేలు, పార్టీలోని ఎన్నికైన సభ్యులు, జిల్లా, బ్లాక్ స్థాయి ఆఫీస్ బేరర్ల నుంచి తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన మూడు బృందాలు నివేదికలను సిద్ధం చేస్తాయని, వాటిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పిస్తాయని ఆయన తెలిపారు.