
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీని బుధవారం ప్రకటించారు. అయితే ఇందులో పలవురు కొత్తవారికి అవకాశం లభించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మందికి అవకాశం కల్పించగా, కేంద్ర ఎన్నిక కమిటీలో 15 మంది కి అవకాశం కల్పించారు. ఇక, తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లో కూడా చాన్స్ దక్కింది. కొత్త పార్లమెంటరీ బోర్డులో సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ కమిటీల నుంచి తప్పించడం విశేషం.
పార్లమెంటరీ బోర్డులో.. జేపీ నడ్డా, నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ్ జటియా, బీఎల్ సంతోష్‌లు ఉన్నారు. పార్లమెంటరీ బోర్డు బీజేపీలో అత్యున్నత నిర్ణయాధికార కమిటీగా ఉంది. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర ముఖ్యులు, ఇతర నియామకాల్లో కీలక భూమిక పోషిస్తుంది.
మరోవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, సీనియర్ నేత Om Mathurలను కొత్తగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో చోటుకల్పించారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యునిగా ఉన్న షానవాజ్ హుస్సేన్‌ను తప్పించారు. ఇక, కేంద్ర ఎన్నికల కమిటీలో.. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కె లక్ష్మణ్, సుధా యాదవ్, బీఎల్ సంతోష్, సత్యనారాయన్ జాటియా, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథుర్‌లు సభ్యులుగా ఉన్నారు.