
బెంగళూరు: కర్ణాట అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు ఉదయం బెంగళూరులో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప, తదితరులు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు వంటి కీలక హామీలను బీజేపీ ఇచ్చింది. ఉగాది, దీపావళి, గణేష్ పండుగలలో బీపీఎల్ కుటుంబానికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్టుగా తెలిపింది.
రూ.5 లక్షల వరకు రైతులకు సున్నా వడ్డీ వసూలు చేస్తామని.. 1,000కు పైగా వ్యవసాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆగ్రో ఫండ్స్‌ను రూపొందించే యంత్రాంగాన్ని అమలు చేస్తామని పేర్కొంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలవారీ రేషన్ కిట్‌లు, షెడ్యూల్డ్ కులాలు, తెగల మహిళలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం, కర్ణాటకను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక వంటి ఇతర వాగ్దానాలు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి.
ప్రతి మహానగర కార్పొరేషన్ వార్డులో అటల్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. విశ్వేశ్వరయ్య విద్యా యోజన కింద ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొంది. ‘పోషణ’ పథకం కింద ప్రతి బీపీఎల్ కుటుంబానికి ప్రతిరోజూ అరలీటర్ నందిని పాలు అందివ్వనున్నట్టుగా తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్లలోని ప్రతి వార్డులో డయాగ్నస్టిక్ సదుపాయాలతో కూడిన ఒక నమ్మ క్లినిక్‌ని ఏర్పాటు చేయడం ద్వారా ‘మిషన్ స్వస్త్ కర్ణాటక’ ద్వారా రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది.
రాష్ట్రంలో భూమి లేని, ఇళ్లు లేని లబ్దిదారులను గుర్తించి 10 లక్షల ఇళ్ల స్థలాలను వారికి పంపిణీ చేయనున్నట్టుగా బీజేపీ తెలిపింది. బెంగళూరు వెలుపల తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల సృష్టించనున్నట్టుగా పేర్కొంది. కర్ణాటకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కల్యాణ సర్క్యూట్, బనవాసి సర్క్యూట్, పరశురామ సర్క్యూట్, కావేరీ సర్క్యూట్, గాణగాపుర కారిడార్‌ల అభివృద్ధికి మొత్తం రూ.1,500 కోట్లు కేటాయించనున్నట్టుగా తెలిపింది.