
తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 41 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్లమెంట్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నేతలు కూడా టీడీపీ ఎంపీలకు అభినందనలు తెలిపారు.
సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆ ప్రదేశానికి చేరుకున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీడీపీ, బీజేపీ అనుబంధాన్ని ఎంపీలు నడ్డాకు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అయ్యాయి.