
బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యను రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో పర్యటించేందుకు వెళ్తుండగా.. హిండాన్-మహువా వద్ద తేజస్వి సూర్యను, ఇతర బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పుడు సూర్యతో పాటు రాజస్థాన్ బిజెపి అధ్యక్షుడు సతీష్ పూనియా కూడా ఉన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో సూర్య ఇతర బిజెపి నాయకులు, మద్దతుదారులతో కలిసి నిరసనకు కూర్చున్నారు. అనంతరం పోలీసులు సూర్య, సతీష్ పూనియాలతో పాటుగా ఇతర బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
కరౌలి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో.. కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై సూర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహువా సరిహద్దు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నగరాన్ని నగరాన్ని సందర్శించడానికి వెళ్లడం తన రాజ్యాంగ హక్కు అని సూర్య అన్నారు.రాజస్తాన్‌లోని నియంతృత్వ ప్రభుత్వం మా హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. అందుకే నిరసన తెలుపుతున్నామని చెప్పారు.
‘‘కరౌలి అల్లర్లు రాజస్థాన్‌లో స్పష్టమైన అన్యాయాన్ని సూచిస్తున్నాయి. రామనవమి శోభ యాత్రకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు. దురాక్రమణదారులపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టపడకపోవడం శోచనీయం’’ అని సూర్య అంతకుముందు ట్వీట్ చేశారు. నిందితులను శిక్షించేవరకు బీజేవైఎం పోరాటం చేస్తుందని చెప్పారు. కరౌలికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఇక, ఏప్రిల్ 2వ తేదీన కరౌలీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హిందూ నూతన సంవత్సరం సందర్భంగా కొందరు బైక్ ర్యాలీ తీశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం గుండా వెళ్తుండగా రాళ్ల దాడి జరిగింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దుకాణాలు, ఇళ్లకు సైతం అల్లరిమూక నిప్పుపెట్టాయి. దీంతో దుకాణాలు, నివాసాలు దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో నగరంలో వారం రోజుల పాటు కర్ఫ్యూ ఉంది.ర్యాలీలోని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో రాళ్లదాడి చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో 8 మంది తమ సిబ్బందితో సహా 11 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
మత ఘర్షణల తర్వాత పోలీసులు 46 మందిని అరెస్టు చేసి, మరో ఏడుగురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారని భరత్‌పూర్ పరిధిలోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రషన్ కుమార్ ఖమేస్రా వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. తేజస్వి సూర్య సారథ్యంలోని బీజేపీ ప్రతినిధి బృందం పర్యటనకు సిద్ధం కావడంతో రాష్ట్రప్రభుత్వం కరౌలీకి అదనపు బలగాలను పంపింది.