
JP MP Satish Gautam touches woman MLA on stage: చట్టసభలో సభ్యుడిగా ఉన్న ఓ బీజేపీ ఎంపీ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి మహిళా ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అది అందరూ చూస్తుండగా ఒక సమావేశంలో వేదికపై.. ! మహిళా ఎమ్మెల్యే భుజాలపై రెండు చేతులు వేసి గట్టిగా నొక్కినట్లు పట్టుకున్న దృశ్యాలు సంబంధిత ఘటన వీడియోలో కనిపించాయి. ఇలా ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. అలీఘర్‌కు చెందిన బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ వేదికపై తన పార్టీ మహిళా ఎమ్మెల్యేను అసభ్యకరంగా తాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీరామ్ బాంక్వెట్ హాల్‌లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కోల్ ఎమ్మెల్యే అనిల్ పరాశర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలీఘర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఎంపీ సతీష్ గౌతమ్, ఎమ్మెల్యే ముక్తారాజా కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలోనే సంభాషణ సమయంలో సతీష్ గౌతమ్ మహిళా ఎమ్మెల్యేను అనుచితంగా తాకినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. ఇలా అనుచితంగా తాకడంతో మహిళా ఎమ్మెల్యే అసౌకర్యానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపింది.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి దయాశంకర్‌సింగ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్, మాజీ మేయర్ శకుంతలా భారతి, బీజేపీ కార్యవర్గ సభ్యురాలు పూనమ్ బజాజ్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు విజయ్‌సింగ్ సహా పలువురు ప్రముఖులు వేదికపై ఉన్నారు. మహిళా ఎమ్మెల్యే పట్ల బీజేపీ ఎంపీ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ఇలా ప్రవర్తిస్తే.. బీజేపీలో సామాన్య కార్యకర్తలు, ప్రజల పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తోంది.