బీజేపీ ‘‘మహా’’ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే

By Siva Kodati  |  First Published Nov 24, 2019, 3:36 PM IST

రాజస్థాన్‌కు చెందిన భూపేంద్రయాదవ్ ‘‘మహా ప్లాన్’’ వెనుక మాస్టర్ మైండ్‌గా తెలుస్తోంది. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన యాదవ్... రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు


తెల్లారితే ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారనగా... అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో యావత్ దేశంతో పాటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఖంగుతిన్నారు. రాజకీయ పండితులనే దిమ్మ తిరిగేలా చేసిన ఈ వ్యూహం వెనుక ఎవరున్నారు అనేది అంతుచిక్కలేదు. చాలామంది అమిత్ షా, నితిన్ గడ్కరీల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే వీరందరినీ పక్కనబెట్టి రాజస్థాన్‌కు చెందిన భూపేంద్రయాదవ్ ‘‘మహా ప్లాన్’’ వెనుక మాస్టర్ మైండ్‌గా తెలుస్తోంది. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన యాదవ్... రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీ, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్ ఇలా చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి భూపేంద్ర యాదవ్ వ్యూహాలే కారణం.

Latest Videos

undefined

తమ ఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేనలు సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న తరుణంలో...దాదాపు ఐదు రోజుల కిందటే ఆయన ఎలాంటి ప్రచారం లేకుండా ముంబై చేరుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి అనుమానం రాకుండా అజిత్ పవార్‌తో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటూ పనిచక్కబెట్టారు.

ఈ నెల 20న ప్రధాని నరేంద్రమోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన రోజునే తన అసలైన వ్యూహానికి భూపేంద్ర పదనుబెట్టారు. అజిత్ బీజేపీకి దగ్గరవుతున్న విషయాన్ని శరద్ పవార్ పసిగట్టారు. ఈ సంగతిని మోడీ వద్ద సైతం ప్రస్తావించారు. ‘‘అజిత్‌కు మీరు మరీ అంత ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదు’’ అని తేల్చిచెప్పారు. పవార్ బయటికి వెళ్లిన కొద్దిసేపటికే మోడీ, అమిత్ షాలు ఏకాంతంగా సమావేశమై.. మహారాష్ట్రలో అనుసరించాల్సిన వ్యూహానికి పదునుబెట్టారు.

శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకు, అజిత్‌కు మధ్య ఎంతోకాలంగా విభేదాలున్నాయి. అంతేకాక తన కుమారుడు పార్థ పవార్ ఎదుగుదలకు శరద్ పవార్ సహరించడం లేదన్న కోపం అజిత్ పవార్‌లో స్పష్టంగా ఉంది. కొంచెం జాగా దొరికితేనే అల్లుకుపోయే మోడీ-షాలు ఈ విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్సీపీని అస్థిర పరచాలంటే పవార్ కుటుంబాన్ని చీల్చాలని, అప్పుడే దీర్ఘకాలంలో బీజేపీకి లాభమని ఇద్దరు నేతలు భావించారు.

అప్పటికే ముంబైలో తిష్టవేసిన భూపేంద్ర యాదవ్‌కు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఎన్సీపీ-శివసేన కీలక భేటీలకు అజిత్ పవార్‌ను పంపుతూ... లోపల ఏం జరిగిందనేది యాదవ్ తెలుసుకుంటూ వచ్చారు. శుక్రవారం రాత్రికి పకడ్బందీ ప్లాన్ గీసిన భూపేంద్ర యాదవ్.. బీజేపీకి మద్ధతు ఇచ్చే లేఖలతో అజిత్ పవార్‌ను తీసుకుని రాజ్‌భవన్‌కు వెళ్లారు.

రాత్రి 11.45 గంటలకు భూపేంద్ర యాదవ్-అజిత్‌ల మధ్య పదవుల పంపకంపై ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో తెల్లవారే సమయానికి ప్రమాణ స్వీకారం జరిగేలా చూడాలని అజిత్ పవార్.. అమిత్ షాను కోరారు. దీని ప్రకారమే ఉదయం 6.30 కల్లా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం పూర్తయి పోవాలని అమిత్ షా ఆదేశించారు. అయితే ఏర్పాట్లు చేయడానికి కాస్త సమయం కావాలని గవర్నర్ కార్యదర్శి కోరడంతో ఉదయం 7.50 గంటలకు ఫడ్నవీస్, పవార్‌ల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేశారు.

అధికారిక ఛానెల్ అయిన దూరదర్శన్‌కు సైతం సమాచారం లేకుండా మీడియాకు, ఇతర పార్టీలకు, ప్రముఖులకు, అధికారులకు సైతం ఆహ్వానాలు పంపకుండా కేవలం ఫడ్నవీస్ కుటుంబం, రాజ్‌భవన్ సిబ్బంది, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు మాత్రమే రాజ్‌భవన్‌లో ఉన్నారు. అలా ఎక్కడా చిన్న అనుమానం కూడా రాకుండా రహస్యంగా వ్యూహరచన చేసిన అమిత్ షాతో పాటు దానిని అమలు చేసిన భూపేంద్ర యాదవ్‌లు మహా ఎపిసోడ్‌లో కీ రోల్ ప్లే చేశారు. 

read Also

కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

శరద్ పవార్ క్యాంపులోకి తిరిగి ధనుంజయ్ ముండే

click me!