బీజేపీ నేతలకు బ్రెయిన్ లేదు.. నేను రామ భక్తుడినే.. ఆలయాలనూ నిర్మించా - సిద్ధరామయ్య..

By Sairam Indur  |  First Published Mar 1, 2024, 2:08 PM IST

తాను రామ భక్తుడిని అని, తన గ్రామంలో రామాలయాలను నిర్మించాలనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని, అందుకే తాను జై శ్రీరామ్ అనడం లేదని, జై సీతారాం అంటానని ఆయన చెప్పారు.


బీజేపీపై, ఆ పార్టీ నేతలపై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ నాయకులకు బ్రెయిన్ లేదని అన్నారు. తను కూడా రామాలయాలను నిర్మించానని చెప్పారు. తాను కూడా రాముడి భక్తుడినేనని అన్నారు. తన పేరులోనే రాముడు ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన కర్ణాటక శాసన సభలో‘జై సీతారాం’ నినాదాలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ నసీర్ హుస్సేన్ మంగళవారం రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన నిందితులను పట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహించినందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, జేడీ (ఎస్) నిరసనల మధ్య అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు ఈ విధంగా ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. అనంతరం బీజేపీ, జేడీఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

Latest Videos

‘‘ప్రజలు మిమ్మల్ని(బీజేపీ) గమనిస్తున్నారు. మీరు రాష్ట్రానికి (కేంద్రం) చేసిన అన్యాయాన్ని సమర్థిస్తున్నారు. మోడీ ముందు మాట్లాడే దమ్ము వారికి (రాష్ట్ర బీజేపీ నేతలకు) లేదు’’ అని ‘మోడీ, మోడీ’ నినాదాలు చేస్తున్న బీజేపీ శాసనసభ్యులపై సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వారు జై శ్రీరామ్ నినాదాలు చేయడం మొదలు పెట్టగానే ఆయన జై జై సీతారాం, జై జై సీతారాం అంటూ రిప్లై ఇచ్చారు.

‘‘బీజేపీ వాళ్లకు తల లోపల బ్రెయిన్ లేదు, తల ఖాళీగా ఉంది. వాళ్లు రామాయణం లేదా మహాభారతం చదవలేదు. ఇతరులు చెప్పేది వింటారు. అయోధ్యలో ఎవరో రామ మందిరాన్ని నిర్మించారని, దాని కోసం ఇక్కడ నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను కూడా రామ మందిరాలు నిర్మించాను’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘ప్రతిదానికీ జై శ్రీరామ్ అంటున్నారు. మనం రామభక్తులం కాదా? మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాబట్టి జై శ్రీరామ్ అనడం లేదు. జై సీతారాం అంటాం. అన్ని రామాలయాల్లో శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు (హనుమంతుడు) ఉంటారు..కానీ ఈ వ్యక్తులు (బీజేపీ) జై శ్రీరామ్ మాత్రమే అంటారు. నా గ్రామంలో రెండు రామాలయాలను నిర్మించాను. నేను రామ భక్తుడిని కాదా ? నా పేరు మీద రాముడు ఉన్నాడు’’ అని సీఎం తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ నమ్మే సీతా రాముడిని విశ్వసిస్తుందని సిద్ధరామయ్య అన్నారు. కానీ బీజేపీ నాథురామ్ గాడ్సే నమ్మే రాముడిని విశ్వసిస్తోందని చెప్పారు. బీజేపీకి, కాంగ్రెస్ కు ఉన్న తేడా అదే అని అన్నారు. బీజేపీ నాయకులకు ఎన్నడూ రాష్ట్ర భక్తి లేదని, వారు స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటీష్ వారితో ఉన్నారని, దానికి సిగ్గుపడాలని ఆరోపించారు.

click me!