మీ గుట్టంతా కలిపి నా దగ్గర 6.3 జీబీ వుంది: ఉద్ధవ్ సర్కార్‌పై ఫడ్నవీస్ సంచలనం

Siva Kodati |  
Published : Mar 23, 2021, 02:25 PM IST
మీ గుట్టంతా కలిపి నా దగ్గర 6.3 జీబీ వుంది: ఉద్ధవ్ సర్కార్‌పై ఫడ్నవీస్ సంచలనం

సారాంశం

మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను కాపాడుకునే క్రమంలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుందంటూ ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉద్ధవ్ సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి.

మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను కాపాడుకునే క్రమంలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుందంటూ ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు.

త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంవీఏ సర్కార్ బండారం బయటపెడతామని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో ఐపీఎస్, నాన్ ఐపీఎస్ అధికారుల బదిలీ పోస్టింగ్ రాకెట్‌కి సంబంధించిన కీలక పత్రాలు, కాల్ రికార్డింగులు తమ వద్ద ఉన్నాయని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ డేటాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోంశాఖ సెక్రటరీకి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

‘‘బదిలీ రాకెట్’’‌కి సంబంధించి తన వద్ద మొత్తం 6.3 జీబీ డేటా ఉందని ఫడ్నవీస్ అన్నారు. బదిలీ రాకెట్‌‌కి సంబంధించి అనుమానితుల కాల్ రికార్డులను ఆగస్టు 20న ఇంటెలిజెన్స్ కమీషనర్... మహారాష్ట్ర డీజీపీకి పంపించారని ఆయన తెలిపారు.

తర్వాత వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు పంపించారని.. వీటిపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ అడ్డుకున్నారని ఫడ్నవిస్ ఆరోపించారు.

ఫిబ్రవరి ద్వితీయార్థంలో తాను కరోనా వల్ల ఐసొలేషన్‌లో ఉన్నానంటూ హోంమంత్రి దేశ్‌ముఖ్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని ఫడ్నవిస్ మండిపడ్డారు. వీఐపీ కదలికలపై పోలీసుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం...  అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 17న సహ్యాద్రి గెస్ట్ హౌస్‌కి, ఫిబ్రవరి 24న మంత్రాలయానికి వెళ్లారని మాజీ సీఎం అన్నారు.

అలాగే ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు హోంమంత్రి హోం క్వారంటైన్‌లోనే ఉన్నప్పటికీ.. అధికారులను కలుస్తూనే ఉన్నారని దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ కారణంగా ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు హోంమంత్రి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఉన్నారంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిన్న మీడియా సమావేశంలో కొన్ని డాక్యుమెంట్లు చూపించిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu