బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన హర్యానా సీఎం

By Sumanth KanukulaFirst Published Aug 23, 2022, 12:45 PM IST
Highlights

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ కన్నుమూశారు. ప్రస్తుతం గోవాలో ఉన్న సోనాలి ఫోగట్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ కన్నుమూశారు. ప్రస్తుతం గోవాలో ఉన్న సోనాలి ఫోగట్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె తన వద్ద పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులతో కలిసి గోవా వెళ్లింది. అయితే సోమవారం రాత్రి అసౌకర్యంగా ఉన్నట్టుగా చెప్పడంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందరు. అయితే ఇందుకు కొన్ని గంటల ముందు కూడా సోనాలి ఫోగట్ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోనాలి ఫోగట్ మృతిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విచారం వ్యక్తం చేశారు. ‘‘సోనాలి ఫోగట్ మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను’’ అని ట్వీట్ చేశారు. 

ఇక, సోనాలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అడంపూర్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. కుల్దీప్ బిష్ణోయ్  గత నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక, సోనాలి ఫోగట్‌కు కుమార్తె యశోధర ఫోగట్ ఉంది. సోనాలి భర్త సంజయ్ ఫోగట్ 2016లో 42 ఏళ్ల వయసులో వారి ఫామ్‌హౌస్‌లో మరణించాడు.

ఇక, సోనాలి ఫోగట్ టిక్‌టాక్ వీడియోలతో  ఫేమస్ అయ్యారు. ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ కలిగి ఉంది.  2006లో టీవీ యాంకర్‌గా రంగప్రవేశం చేసిన ఆమె.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. ఆమె 2016లో 'అమ్మా: ఏక్ మా జో లఖోన్ కే లియే బని అమ్మ' అనే టీవీ షోతో తన నటిగా రంగ ప్రవేశం చేసింది. ఆమె 2019లో 'ది స్టోరీ ఆఫ్ బద్మాష్‌గఢ్' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. 
 

click me!