బీజేపీ పడక గదుల్లోకి కూడా వచ్చేసింది - ఉత్తరాఖండ్ యూసీసీపై ప్రతిపక్షాల కామెంట్స్..

By Sairam Indur  |  First Published Feb 7, 2024, 9:49 AM IST

ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ(UCC)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లు (Uniform Civil Code) వల్ల ఇక నుంచి బీజేపీ (BJP) పడక గదుల్లోకి కూడా (BJP now in bedrooms) ప్రవేశించనుందని, కోరుకున్న వారిని విచారించనుందని ఆరోపించాయి. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే యూసీసీని ముందుకు తీసుకువచ్చిందని విమర్శించాయి. 


ఉత్తరాఖండ్ ప్రతిపాదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లుపై ప్రతిపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు నెల రోజుల ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒక వేల రిజిస్టర్ చేసుకోకుండా ఒక నెల కంటే ఎక్కువ కాలం లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే, వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ .10,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

దీనిపై టీఎంసీ నాయకుడు సాకేత్ గోఖలే ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ఇప్పుడు పడక గదుల్లోకి కూడా ప్రవేశించిందని మండిపడ్డారు. ప్రతిపాదిత బిల్లుపై టీఎంసీ నేత ‘ఎక్స్’లో  ‘‘ ఈ దిగ్భ్రాంతికరమైన నిబంధన ఎలా ఉందంటే.. ఒక స్త్రీ, పురుషుడు కలిసి జీవిస్తే.. తాము లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో లేరని నిరూపించవలసి ఉంటుంది. కొంతమంది పిచ్చివాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు బీజేపీ మీ పడకగదిలోకి అడుగు పెట్టింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని విచారించవచ్చు’’ అని అన్నారు.

This shocking provision also means that a man & a woman merely living together will have to prove that they’re NOT in a live-in relationship in case some vigilante or lunatic files a complaint.

BJP has now stepped into your bedrooms & can investigate you whenever it feels like. pic.twitter.com/OvN0kgVQRV

— Saket Gokhale (@SaketGokhale)

Latest Videos

undefined

ఈ బిల్లుపై కాంగ్రెస్ నాయకుడు షామా మహ్మద్ కూడా స్పందించారు. ‘‘బీజేపీ ప్రభుత్వం పెద్దల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటానికి చేసిన సిగ్గుమాలిన ప్రయత్నమే ఈ బిల్లు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లు ఒక నెల వ్యవధిలో 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది. లేకపోతే జంటలు 6 నెలల జైలుకు వెళ్లాలి. రాష్ట్రంలో ఏకాభిప్రాయంతో సహజీవనం చేస్తున్న పెద్దల జీవితాల్లోకి ఇది బీజేపీ ప్రభుత్వం చొరబాటు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పని కాదు.’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కూడా ఈ బిల్లుపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం విఫలమైనప్పుడు రాష్ట్ర అసెంబ్లీలు ఏదో ఒకటి తీసుకురావాలి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఎప్పటికప్పుడు ఈ పని చేస్తుంటారు. కొన్నాళ్లు సీఎంగా కొనసాగాలని భావిస్తున్నందున ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ బిల్లును చెత్తబుట్టలో పడేయాలి.’’ అని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి మాట్లాడుతూ..  ‘‘ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మహిళల భద్రత, రాష్ట్రంలో శాంతిభద్రతలు సహా అన్ని అంశాల్లో విఫలమైంది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఈ యూసీసీ. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి ఉంటుంది.’’ అని అన్నారు. 

ఇదిలా ఉండగా.. మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూసీసీ ప్రకారం.. లివ్-ఇన్ రిలేషన్షిప్ లోకి ప్రవేశించిన జంటలు నెల రోజులలోపు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఉత్తరాఖండ్ గెజిట్ లో నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రార్ గా వ్యవహరించే అధికారాన్ని రిజిస్ట్రార్ కు ఇవ్వవచ్చని కోడ్ పేర్కొంది. కాగా.. ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రానంతరం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.

click me!