
బెంగళూరు: దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ట్రానికి మే 10న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం మంగళవారం రాత్రి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి బరిలో ఉన్న సిద్దా రామయ్య, డీకే శివకుమార్‌లపై బీజేపీ పోటీకి దింపిన అభ్యర్థులూ ఈ జాబితాలోనే ఉండటం గమనార్హం. అలాగే, ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై అభ్యర్థిత్వం కూడా ఇందులో ఉన్నది.
మంగళవారం రాత్రి బీజేపీ 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా త్వరలోనే ప్రకటించనుంది. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు బీజేపీ స్పష్టం చేసింది. మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప కొడుకు బీవై విజయేంద్ర షికారిపుర సీటు నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ సీటు గతంలో బీఎస్ యెడియూరప్పకు చెందినది.
ఇదిలా ఉండగా, సిద్దా రామయ్యపై వరుణ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బీ సోమన్న బరిలోకి దిగాడు. డీకే శివకుమార్ పై కనక్‌పురా నుంచి ఆర్ అశోక్ పోటీ చేస్తున్నాడు. ఆయన రెండు సీట్లలో పోటీ చేయనున్నాడు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్కమగళూరులో పోటీ చేయనున్నారు. రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారీ గ్రామీణ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ ప్రముఖ నేతలు రమేశ్ జర్కిహోలి గోకక్ నుంచి గోవింద్ ఎం కార్జలో ముధోల్ నుంచి పోటీ చేస్తున్నారు.
బీజేపీ విడుదల చేసిన తొలి జాబితా అభ్యర్థుల్లో అంటే మొత్తం 189 పేర్ల లిస్టులో 52 మంది కొత్తవారు. ఆ 189 మందిలో 32 మంది అదర్ బ్యాక్‌వర్డ్ కమ్యూనిటీకి చెందినవారు కావడం గమనార్హం. 30 మంది ఎస్సీలు ఉన్నారు.
కాగా, అదే జాబితాలో తొమ్మిది మంది వైద్యులు, ఐదుగురు లాయర్లు, ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు.