
జైపూర్: రాజస్తాన్‌లో ఓ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములను ముగ్గురు అక్కా చెళ్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వారు సమస్యలతో ముప్పిరిగొని ఉన్నారు. దీంతో వారు నిస్సహాయులగా మారి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దామెకు ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరినీ ఆమె తనతో పాటే తీసుకెళ్లింది. మిగతా ఇద్దరు గర్భిణిలు.
కాలు, కమలేశ్, మమతా మీనాలు ముగ్గురు అక్కా చెల్లెళ్లు. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే ఇంటి కోడళ్లుగా వారి కుటుంబం పంపింది. ఓకే చోట వారంతా కలిసి ఉంటారని ఆ అక్కా చెల్లెళ్ల తల్లిదండ్రులు ఆశించారు. కానీ, అనుకున్నంత సానుకూల వాతావరణం అక్కడ లేదు. ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే ఇంటిలో ఉంటున్నప్పటికీ వారి భర్తలు, అత్తమామ, ఆడబిడ్డ నుంచి అదనపు వరకట్నం కోసం వేధింపులు వచ్చాయి. ఈ వేధింపులు నిత్యకృత్యం అయ్యాయి. మెట్టినింట డిమాండ్లను వారి తండ్రి అందుకోలేకపోయాడు. దీంతో వేధింపులు ఆగలేదు. ఈ వేధింపులకు తాళలేక ఆ అక్కా చెల్లెళ్లు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.
ఆ ముగ్గురిలో ఒకరు తన బంధువుకు మరణానికి ముందు ఓ మెసేజీ పంపింది. ఆ మెసేజీ ఆధారంగా వారు అదనపు కట్నం వేధింపులు తాళలేకనే బలవన్మరణానికి పాల్పడ్డట్టు స్పష్టం అవుతున్నది.
మాకు చావాలని లేదు. కానీ, ఇంటికాడి వేధింపుల కంటే మరణమే చాలా నయం అనిపిస్తున్నది. మా మరణాలకు కారణం అత్తింటివారే. ప్రతి రోజూ చచ్చి బతికాలని తాము అనుకోవడం లేదు. అందుకే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం అని ఒకామె వాట్సాప్ మెసేజీ పంపింది.
ఈ అక్కా చెల్లెళ్ల తండ్రి సర్దార్ మీనా గుండె పగిలిపోయేలా రోధించాడు. తనకు మొత్తం ఆరుగురు కూతుళ్లు అని వివరించాడు. అందరూ అడిగినన్ని తాను ఇచ్చుకోలేనని వ్యవసాయం చేసుకునే సర్దార్ మీనా ఆవేదన పడ్డాడు. అయినప్పటికీ తన ముగ్గురు బిడ్డల అత్తవారింట్లో చాలా సామాన్లు తాను కొనిచ్చినవేనని అన్నాడు. బెడ్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ అన్నీ తాను కొన్నవేనని, కావాలంటే వెళ్లి చూడండని గుండెలు బాదుకున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పుడైతే వారిది ఆత్మహత్యగానే పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల భర్తలను, వారి అత్తను, ఆడబిడ్డను వరకట్న వేధింపుల కింద పోలీసులు అరెస్టు చేశారు.