
Kejriwal in Gujarat: ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల సొంతగడ్డ అయిన గుజరాత్ మీద దృష్టి సారించారు. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ దృష్టిని కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ శనివారం గుజరాత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం AAP తిరంగ యాత్ర అని పేరుతో రోడ్‌షోలో నిర్వహించారు.
రోడ్‌షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గుజరాత్‌లో 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అవినీతిని అంతం చేయలేకపోయిందని అన్నారు. తాను ఏ పార్టీని విమర్శించేందుకు గుజరాత్ కు రాలేదని, బీజేపీ, కాంగ్రెస్‌లను విమర్శించడం తన ఉద్దేశ్యం కాదని,గుజరాత్‌ను గెలిపించేందుకు వచ్చానని.. , గుజరాతీలు గుజరాత్‌ను గెలిపించాలని, గుజరాత్‌లో అవినీతిని అంతం చేయాలని ఆయన అన్నారు.
గుజరాత్‌లో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నదని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక్కడ ప్రజల మాట వినడం లేదనీ, పంజాబ్, ఢిల్లీ ప్రజలు ఇచ్చినట్టు ఆమ్ ఆద్మీకి ఒక్క అవకాశం ఇవ్వండని, పార్టీ నచ్చకపోతే వచ్చేసారి మమ్మల్ని మార్చండని.. కానీ.. ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండని గుజరాతీలను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇస్తే అన్ని పార్టీలను మరిచిపోతారన్నారు.
అంతకుముందు రోజు.. కేజ్రీవాల్, సీఎం మాన్ లు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. వారు మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ నివాస గృహం 'హృదయ్ కుంజ్ ను సందర్శించారు. పలు పుస్తకాలను పరిశీలించారు. అలాగే.. చరఖాతో నూలు వడికారు. ఆశ్రమంలోని మ్యూజియాన్ని సందర్శించారు. ఆశ్రమ పర్యటన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. గాంధీజీ పుట్టిన దేశంలోనే పుట్టినందుకు గర్వపడుతున్నాననీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. గుజరాత్ పర్యటించడం తొలిసారనీ, కానీ తాను సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు పలు మార్లు సందర్శించాననితెలిపారు.
అనంతరం.. సీఎం మాన్ మాట్లాడుతూ.. "నేను స్వాతంత్య్ర సమరయోధుల రాష్ట్రం పంజాబ్ నుండి వచ్చాను. నేను ఇక్కడ చాలా చూశాను. గాంధీజీ లేఖలు, ఆయన సారథ్యం వహించిన వివిధ ఉద్యమాలు. పంజాబ్‌లోని ప్రతి ఇతర ఇంటిలో చరఖా భాగం. మా అమ్మ, అమ్మమ్మ చరఖా ఉపయోగిస్తారు. చిన్నప్పటి నుంచి చరఖా వాడటం చూశాను. మేము జాతీయవాదులం, మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము. పంజాబ్ సీఎం అయిన తర్వాత గుజరాత్‌కి ఇది నా మొదటి పర్యటన అని అన్నారు.