ఇంధ‌న ధ‌ర‌ల పెంపుపై కేంద్రంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన బీజేపీ మిత్ర‌ప‌క్షం.. ఏమందంటే ?

Published : Apr 05, 2022, 06:18 PM IST
ఇంధ‌న ధ‌ర‌ల పెంపుపై కేంద్రంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన బీజేపీ మిత్ర‌ప‌క్షం.. ఏమందంటే ?

సారాంశం

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) కూడా ఈ జాబితాలో చేరింది. 

న్యూఢిల్లీ : భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలపై ఎన్‌డీఏ కూట‌మి, బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన జనతాదళ్ (యునైటెడ్) అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వెంట‌నే ధ‌ర‌లను త‌గ్గించాల‌ని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ కేసీ త్యాగి మీడియాతో మాట్లాడారు. గ‌త 15 రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట‌గ్యాస్ పై పెంచిన ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని సూచించారు.  

‘‘ పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ మరియు LPG ధరల పెంపును నిలిపివేయాలి ’’ అని కేసీ త్యాగి తెలిపారు. ‘‘ ఇది ద్రవ్యోల్బణంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వారు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఎంతో ఉత్సాహంతో ఎన్‌డీఏను గెలిపించిన ఓట‌రుపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ’’ అని అన్నారు. 
 
పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత రెండు వారాల్లో మొత్తం మీద పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మొత్తంగా రూ. 9.20 పెరిగాయి. మార్చి 22వ తేదీన రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 13వ సారి. 

పెట్రలో డిజీల్ పెంపుపై లోక్‌సభలో నిరసనలు చెలరేగాయి. ఈ విష‌యంలో మంగళవారం కొందరు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ అర‌వడంతో సభను వరుసగా రెండుసార్లు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైంది. వెంటనే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే టీఆర్ బాలు ఇంధన ధరల పెంపుపై చర్చకు డిమాండ్ చేశారు.

ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుండగా కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు లోక్‌సభ మధ్యలో బైఠాయించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు.

అయితే దీనికి పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ పూరీ స్పందించారు. పెట్రోల్ ధ‌రల పెరుగుద‌లను స‌మ‌ర్ధించారు. ఇతర దేశాలు పెంచిన ధరల్లో భారత్‌లో పదో వంతు పెరుగుతోంద‌ని అన్నారు. భారత్‌లో ధరల పెంపు కేవలం 5 శాతం కాగా, అమెరికా, ఫ్రాన్స్‌లలో ఒక్కోటి 50 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. ‘‘ 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో పెట్రోల్ ధరలు యుఎస్‌లో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, యుకేలో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం, స్పెయిన్‌లో 58 శాతం పెరిగాయి. అయితే ఇదే సమయంలో..  భారతదేశంలో కేవలం 5 శాతం మాత్రమే పెరిగాయి. ’’ అని చెప్పారు.  

 


 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu