
Hijab Row: కర్నాటకలో రాజుకున్న హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పాటు కర్నాకట రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలకు పాకింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందిస్తూ... బికినీ వేసుకున్నా.. గూంగట్ ధరించినా.. జీన్స్ వేసుకున్నా.. హిజబ్ ధరించినా.. తాము ఏం ధరించాలన్నది.. మహిళలకు చెందిన హక్కు అని ప్రియాంకా అన్నారు. మహిళలను వేధించడం ఆపేయాలని, నచ్చిన దుస్తుల్ని ధరించడం మహిళల హక్కు అని ఆమె స్పష్టం చేశారు. కర్నాటకలో క్లాస్‌రూమ్‌లలో హిజాబ్ ధరించకుండా నిషేధించబడిన కళాశాల విద్యార్థులకు మద్దతుగా ఆమె మాట్లాడారు. ఏ బట్టలు ధరించాలనే ఎంపిక వారిదేననీ, ఈ హక్కు రాజ్యాంగం ద్వారా కల్పించబడిందంటూ ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"అది బికినీ అయినా, గూంగట్ అయినా , ఒక జత జీన్స్ అయినా, లేదా హిజాబ్ అయినా, తాను ఏమి ధరించాలో నిర్ణయించుకోవడం ఒక మహిళకు సంబంధించిన హక్కు. ఈ హక్కు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. మహిళలను వేధించడం ఆపండి" అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. #ladkihoonladsaktihoon అనే హ్యాష్‌ట్యాగ్ ను తన ట్వీట్ కు జోడించారు.
అలాగే, కాంగ్రెస్ నాయకుడు, కేరళ ఎంపీ రాహుల్ గాంధీ సైతం తన సోదరి ట్వీట్ పై 'థంబ్స్-అప్' ఎమోజీతో స్పందించారు. కాగా, గురువారం నుంచి ఏడు దశల్లో యూపీ ఎన్నికలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే #ladkihoonladsaktihoon ప్రచారంలో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా మహిళా హక్కులు, మహిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక అంశాలను లేవనెత్తింది. మహిళా హక్కులను అంశాన్ని ప్రియాంక గాంధీ ప్రస్తావిస్తూ.. ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు.
రాహుల్ గాంధీ సైతం కర్నాటక అంశంపై ఇప్పటికే స్పందించారు. హిజాబ్ ధరించిన విద్యార్ధినులకు మద్దతుగా నిలిచారు. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్ణాటకలోని పలు కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై వివాదం చెలరేగుతున్న తరుణంలో.....కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారికి మద్దతు తెలిపారు. దేశంలో ఆడపిల్లల భవిష్యత్తు దోపిడికి గురవుతుందని మండిపడ్డారు. సరస్వతీ దేవి ఎవరి పట్ల వివక్ష చూపించదని, ఆమె అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
కాగా, గత వారం రోజుల నుంచి కర్నాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. ఉడిపి జిల్లాలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి క్లాస్‌రూమ్‌కు వెళ్లడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆ రాష్ట్ర విద్యార్థులు కాషాయ కండువాలను ధరిస్తూ కాలేజీలకు వెళ్లడం వివాదంగా మారింది. దీంతో కర్నాటకలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం హిజాబ్, కాషాయ ఖండువాల వివాదం ఇతర రాష్ట్రాలకు సైతం పాకుతున్నది.