దొంగతనం ఆరోపణతో కేరళలో మూక దాడి.. బిహారీ కూలీ దారుణ హత్య.. రెండు గంటలపాటు దాష్టీకం

Published : May 21, 2023, 07:52 PM IST
దొంగతనం ఆరోపణతో కేరళలో మూక దాడి.. బిహారీ కూలీ దారుణ హత్య.. రెండు గంటలపాటు దాష్టీకం

సారాంశం

కేరళలో జరిగిన మూక దాడిలో బిహార్‌కు చెందిన కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. చేతులు వెనక్కి కట్టేసి సుమారు రెండు గంటలపాటు దాడి చేశారు. అనంతరం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారు. మలప్పురం జిల్లాలో మే 12వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.  

మలప్పురం: కేరళలో ఓ బిహారీ కూలీపై మూక దాడి చేసింది. ఈ మూక దాడిలో రాజేశ్ మంచి అనే కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. దొంగతనం చేశాడనే ఆరోపణతో రాజేశ్‌ను చేతులు వెనక్కి కట్టేసి కర్రలు, ప్లాస్టిక్ పైపులతో చితక బాదారు. చేతులు జోడించి తాను ఏమీ దొంగిలించలదేని ప్రాధేయపడినా సుమారు రెండు గంటలపాటు దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత విడిచిపెట్టి వెళ్లారు. మూక దాడి చేస్తుండగా.. నిందితుల్లో కొందరు వీడియో తీశారు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. స్థానికులు కూడా కనీసం పోలీసులకు సమాచారం అందజేయకపోవడం గమనార్హం. రాజేశ్ మంచి దాదాపు మృత్యు ఒడిలోకి వెళ్లుతున్న సమయంలో పోలీసులు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రాజేశ్ మంచి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో కొండొట్టి కీళిస్సెరీ ఏరియాలో మే 12వ తేదీన చోటుచేసుకుంది.

పోలీసులు హత్యా నేరం, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు కీళిస్సెరీ వాసులు. ముహమ్మద్ అఫ్సల్, ఫాజిల్, షరాఫుద్దీన్, మెహబూబ్, అబ్దు సమాద్, నాజర్, హబీబ్, అయూబ్‌లను అరెస్టు చేశారు. తవనూర్ జైనుల్ అబీద్‌నూ అదుపులోకి తీసుకున్నారు.

రాజేశ్ మంచి బిహార్ వాసి. ఉపాధి కోసం కేరళ వచ్చాడు. ఆయన వచ్చిన మూడు రోజులకే ఈ ఘటన జరిగింది. హత్యకు గురయ్యాడు. అతడిని సమీప జంక్షన్‌కు లాక్కెళ్లి మరీ దాడి చేశారు. ఆయన పని చేస్తున్న ప్రాంతానికి 300 మీటర్ల దూరం తీసుకెళ్లి ఈ దాడి చేసినట్టు మలప్పురం ఎస్పీ సుజీత్ దాస్ తెలిపారు. నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుని, వాటి ద్వారా ఎంతో కీలకమైన సమాచారాన్ని సేకరించామని వివరించారు. సుదీర్ఘ కాలం రాజేశ్‌ను కొడుతున్నా ఎవరూ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. 

Also Read: Bengaluru Rains: బెంగళూరులో ఆంధ్రా యువతి దుర్మరణం.. అండర్‌పాస్‌లోని వరద నీటిలో కారు మునిగి..!

సాక్ష్యాధారాలను ధ్వంసం చేయాలని రాజేశ్ మంచి టీ షర్ట్‌ను దాచిపెట్టారని, ఆ జంక్షన్ సీసీటీవీ కెమెరాలో ఘటన రికార్డు కాకుండా ప్లగ్ తొలగించారనీ ఎస్పీ తెలిపారు. సమీప ప్రాంతాల్లోనూ సీసీటీవీ ఫుటేజీని సేకరించే పనిలో ఉన్నట్టు చెప్పారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

కీళిస్సెరీ మూక దాడి కేసులో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. రానున్న రోజులు మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సుమారు 100 మందిని ఈ కేసులో ప్రశ్నించారు.

పోలీసులను తప్పుదారి పట్టించడానికి తొలుత రాజేశ్ మంచి దొంగతనం చేస్తుండగా బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయాడని నిందితులు తెలిపారు. రాజేశ్ ఎవరో తమకు తెలియదని బుకాయించారు. అయితే, పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి. ఇది దారుణమైనహత్య అని నిర్దారించుకున్నారు. చాతి, పొట్టలో బలమైన గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. 

రాజేశ్ మంచి మృతదేహానికి కోళికోడ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. బిహార్‌లోని వారి కుటుంబ సభ్యులకు మరణ వార్త తెలియజేశారు. కానీ, వారు రాలేకపోతున్నారని చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా పోలీసులు అలసత్వంతో నిందితులకు పరోక్షంగా సహకరిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజేశ్ మంచి దళితుడని, దళితుడిని చంపేసినా ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను కేసులో చేర్చలేదని పేర్కొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్