ఉమెన్స్ హాస్టల్ లో దారుణం.. 40మందిపై అత్యాచారం

First Published Jul 24, 2018, 9:52 AM IST
Highlights

సిబ్బంది అఘాయిత్యానికి నిరాకరించినందుకు ఒక అమ్మాయిని కొట్టి చంపారని, వసతి గృహం ఆవరణలోనే మృతదేహాన్ని పాతిపెట్టారని తోటి అమ్మాయి ఫిర్యాదు చేసింది. 

బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఓ ఉమెన్స్ హాస్టల్ లో ఉన్న  40 మందికి పైగా యువతులపై అత్యాచారం జరిగిందని, ఒక అమ్మాయిని కొట్టి చంపేసి పాతిపెట్టేశారని వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

 21 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 16 మందిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన వారి వైద్య నివేదికలు ఇంకా బయటకు రాలేదు. సిబ్బంది అఘాయిత్యానికి నిరాకరించినందుకు ఒక అమ్మాయిని కొట్టి చంపారని, వసతి గృహం ఆవరణలోనే మృతదేహాన్ని పాతిపెట్టారని తోటి అమ్మాయి ఫిర్యాదు చేసింది. 

ముంబయికి చెందిన స్వచ్ఛంద సంస్థ కొద్ది నెలల క్రితం చేసిన తనిఖీలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మృతదేహం కోసం పోలీసులు హాస్టల్ ఆవరణలో తవ్వి చూస్తున్నారు. ఇంకా మృతదేహం కనిపించలేదు. ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని విపక్ష ఆర్‌జేడీ.. శాసనసభ, మండలిలో డిమాండ్‌ చేసింది. నిందితులను రక్షించడానికి నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. 

హాస్టల్ నిర్వాహకుడు.. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌కు సన్నిహితుడని, ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం కూడా చేశాడని ఆరోపించారు. రాజకీయనేతలు, అధికారులు ఏళ్ల తరబడి ఇక్కడి అమ్మాయిలపై అత్యాచారం చేస్తున్నారని ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చిలోనే తెలుసని, పలువురికి గర్భస్రావం కూడా చేయించారని, అయినా ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. 

ఈ ఆరోపణలపై గత నెలలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి, ఈ వసతి గృహానికి చెందిన మహిళా సిబ్బంది సహా పది మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం వెదుకుతున్నామని చెప్పారు.

click me!