Bihar political crisis: గవర్నర్‌ను కలవనున్న నితీశ్ కుమార్.. బీజేపీకి షాక్ తప్పదా?.. కాసేపట్లోనే సంచలన ప్రకటన!

By Sumanth KanukulaFirst Published Aug 9, 2022, 12:32 PM IST
Highlights

బిహార్‌‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుగుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు ఉదయం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలని జేడీయూ చూస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

బిహార్‌‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుగుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు ఉదయం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలని జేడీయూ చూస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ దిశగా త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నితీశ్ కుమార్.. బిహార్ గవర్నర్‌‌ Phagu Chauhanను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఈ క్రమంలోనే కాసేపట్లోనే పేలుడు లాంటి వార్త వింటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేందుకు నితీశ్ పావులు కదుపుతున్న వేళ.. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న 16 మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా గవర్నర్‌‌ అపాయింట్‌మెంట్ కోరింది. అంతుకుముందు ఈరోజు ఉదయం బిహార్ బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం Tarkishor Prasad నివాసంలో సమావేశమయ్యారు. ఇక, బీజేపీ నేతలు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

మరోవైపు పాట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఈ రోజు ఉదయం ఆర్జేడీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. రబ్రీ దేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యే ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను మీటింగ్ రూమ్‌కు బయటే ఉంచుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి చేరుకుంటున్నారు. 

Also Read: బిహార్‌లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. నితీశ్ కీలక సమావేశం.. అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు వస్తే.. నితీశ్ కుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ఆర్జేడీ, కాంగ్రెస్‌ల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.  చిన్న పార్టీలైన హిందుస్థాన్ అవామ్ మోర్చా, సీపీఐఎంఎల్ కూడా నితీష్ కుమార్‌కు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యయి. ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే బిహార్‌లో బీజేపీకి షాక్ తప్పేలా కనిపించడం లేదు. 

బిహార్ అసెంబ్లీలో బలబలాలు.. 
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే.. 122 మెజారిటీ మార్క్‌ను సాధించాల్సి ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో గెలుపొంది. కూటమిలోని బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు, వికాస్‌హీల్ ఇన్‌సాన్ పార్టీ 4 స్థానాలు, హిందుస్తాన్ అవామ్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు ఆర్జేడీ, దాని మిత్ర పక్షలు.. 110 స్థానాలు సాధించాయి. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా  నిలిచింది. అయితే కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో, వామపక్షాలు 16 స్థానాల్లో విజయం సాదించాయి. 

ఇక, ఆ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ‌కి చెందిన ఎంఐఎం నుంచి ఐదుగురు విజయం సాధించగా.. అందులో నలుగురు ఇటీవల ఆర్జేడీ గూటికి చేరారు. ఇక, చిరాజ్ పాశ్వాన్‌ లోక్‌ జనశక్తి పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ జట్టుగా ఏర్పడితే 140కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండే అవకాశం ఉంది. 
 

click me!