అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ శ్రీరాముడే రావడం లేదు... ఈ విషయాన్ని ఆయనే తన కలలోకి వచ్చి చెప్పాడంటూ బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు.
అయోధ్య : రామజన్మభూమి అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన వందలాదిమంది విఐపిలు ఈ అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. ఇలా దేశవ్యాప్తంగా రామమందిరంపై చర్చ సాగుతున్న వేళ బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ రాముడే రావడంలేదని ఈ బిహార్ మంత్రి అన్నారు.
బిహార్ లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ లో తేజ్ ప్రతాప్ అయోధ్య రామమందిరం గురించి మాట్లాడారు. ఇటీవల శ్రీరాముడు తన కలలోకి వచ్చి అయోధ్య మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావడంలేదని చెప్పారన్నారు. ప్రస్తుత అయోధ్యలో తన మందిరం పేరిట రాజకీయాలు జరుగుతున్నాయని... అందువల్లే అక్కడికి వెళ్లడం లేదని రాముడే స్వయంగా తనతో చెప్పినట్లు తేజ్ ప్రతాప్ వెల్లడించారు.
undefined
తనలాగే నలుగురు శంకరాచార్యులకు కూడా రాముడు కలలో వచ్చారని... అందువల్లే వాళ్లు కూడా అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని తేజ్ ప్రతాప్ అన్నారు. కేవలం ఎన్నికలు వస్తేనే రామమందిరం గుర్తుకువస్తుంది... ఆ తర్వాత రామున్ని మరిచిపోతారు అంటూ బిజెపి నాయకులకు చురకలు అంటించారు.
Also Read అయోధ్యలో అమితాబ్ సొంతిళ్లు ... సరయూ తీరంలో ప్లాట్ కొనుగోలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను వెళ్లడంలేదని ఇలా తనదైన చమత్కారపు మాటలతో బయటపెట్టారు. ఆ శ్రీరాముడే రాని కార్యక్రమానికి తానెందుకు వెళతాను... వెళ్లబోనని తేజ్ ప్రతాప్ తెలిపాడు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు, మరికొందరు నాయకులు అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందినా వెళ్లడంలేదని ప్రకటించారు.