బీహార్‌లో విషాదం: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం..

By Rajesh KarampooriFirst Published Dec 14, 2022, 5:38 PM IST
Highlights

మద్యాన్ని నిషేధించిన బీహార్‌లో విషపూరిత మద్యం మరోసారి విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు సరన్ జిల్లాలో మద్యం సేవించి 21 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ కల్తీ మద్యం సేవించినట్లు సమాచారం.

మద్యాన్ని నిషేధించిన బీహార్‌లో మరోసారి కల్తీ మద్యం విధ్వంసం చోటుచేసుకుంది. సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి సుమారు 20 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మస్రఖ్‌ ప్రాంతానికి చెందిన వారు. ఈ ప్రాంతానికి చెందిన వారు గరిష్టంగా 10 మంది మరణించారు. అమ్నౌర్ ప్రాంతానికి చెందిన వారు ముగ్గురు, మర్హౌరా నుండి ఒకరు మరణించారు.

అదే సమయంలో.. అనారోగ్యంతో పడి ఉన్న చాలా మంది కంటి చూపు కోల్పోయారని ఫిర్యాదు చేశారు. వారు పాట్నాలోని సదర్ ఆసుపత్రి , పిఎంసిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. పలువురు మృతుల బంధువులు కూడా అనారోగ్యంతో మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం ఏమీ వెల్లడించేందుకు నిరాకరిస్తోంది.ఈ విషయంపై ఇంకా విచారణ జరుగుతోందని పోలీసు కెప్టెన్ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఘటన తర్వాత సోమవారం రాత్రి సదర్ ఆసుపత్రి వద్ద పోలీసు బలగాలను మోహరించారు.

రహదారి దిగ్బంధం

ఈ సంఘటనకు ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహాలను మస్రఖ్ హనుమాన్ చౌక్ స్టేట్ హైవే-90పై ఉంచి.. రహదారి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మష్రాఖ్‌లో గ్రామస్తుల నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆగ్రహించిన ప్రజలను ఒప్పించేందుకు పలు పోలీస్ స్టేషన్ల పోలీసులతో పాటు సీనియర్ పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇసువాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా నుండి తెచ్చిన విషపూరిత మద్యం తాగి అమనూర్, మధురా, మష్రాఖ్ బ్లాక్‌లకు చెందిన 21 మంది ఇప్పటివరకు మరణించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. అస్వస్థతకు గురైన వారందరినీ మసరక్ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. అక్కడి నుంచి ఒకరిని ఛప్రా సదర్‌ ఆస్పత్రికి తరలించారు. సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

అందిన సమాచారం ప్రకారం.. ప్రాణాలు కోల్పోయిన వారిలో విజేంద్ర రాయ్, హరీంద్ర రామ్, రామ్జీ సహ, అమిత్ రంజన్, సంజయ్ సింగ్, కునల్ సింగ్, అజయ్ గిరి, ముఖేష్ శర్మ, భరత్రామ్, జయదేవ్ సింగ్, మనోజ్ రామ్, మంగళ్ రాయ్, నజీర్ హుస్సేన్, రమేష్ రామ్, చంద్రరామ్, విక్కీ మహతో, లలన్ రామ్, గోవింద్ రాయ్, ప్రేమ్‌చంద్ షా, దినేష్ ఠూకర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

సోమవారం సాయంత్రం ప్రజలంతా ఒకే చోట మద్యం సేవించినట్లు సమాచారం. దీని తర్వాత.. మంగళవారం నుండి వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. సాయంత్రం అందరినీ మస్రఖ్ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. అక్కడ చికిత్స అనంతరం ఛప్రాకు తరలించగా ముగ్గురు మృతి చెందారు. మస్రాఖ్‌లోని హనుమాన్‌గంజ్‌లో నివాసం ఉంటున్న అజయ్‌కుమార్‌, తాను డోయిలా బజార్‌లో ముఖేష్‌ శర్మతో కలిసి మద్యం సేవించానని చెప్పాడు. కల్తీ మద్యం వల్లే మరణాలు సంభవించినట్టు ఆయా కుటుంబ సభ్యులు చెబుతుండగా, పోలీసులు మాత్రం ఇంతవరకూ ధ్రువీకరించ లేదు.

click me!