
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇటీవలే కల్తీ మద్యం మరణాలు కలకలం రేపాయి. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనూ ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ జరిగింది. ఈ సంచనల కేసులో మాస్టర్ మైండ్ నిందితుడిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. సరన్ జిల్లా డోయిలా గ్రామ నివాసి రామ్ బాబు మహతోగా గుర్తించినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
మహతో ఢిల్లీలోనే ఎక్కడో ఓ చోట తలదాచుకుని ఉన్నాడని ఇంటర్ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ సెల్ ద్వారా తమకు సమాచారం వచ్చిందని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసు రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. కొన్ని కచ్చితమైన వివరాలు, టెక్నికల్ సర్వెలెన్స్ ఆధారంగా మహతోను ద్వార్కాలో పట్టుకున్నట్టు వివరించారు. న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదుపరి యాక్షన్ కోసం అరెస్టుకు సంబంధించిన విషయాలను బిహార్ పోలీసులకు అందించామని వివరించారు.
Also Read: కల్తీ మద్యం మృతులకు ఎలాంటి పరిహారం ఇవ్వం.. సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన
అరెస్టుపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ప్రభుత్వం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నదని అన్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తాము దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు లిక్కర్ బ్యాన్ చేయడం వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను ఆదేశించినట్టు అన్నారు.
బిహార్‌లో మద్యం పై నిషేధం ఉన్నది. ఇక్కడ మద్యం తయారుచేయడం, అమ్మడం, కొనుగోలు చేయడం నిషేధం. మద్యం లభించనందు వల్ల కొందరు ధనార్జన కోసం అక్రమ మార్గం తొక్కుతున్నారు. కల్తీ మద్యం తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే.. సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తయారు చేసి అమ్మడంతో అది తాగి 73 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.