
వరకట్నం అనే సామాజిక భూతం ఇప్పటికీ భారత దేశంలో (India) చాలా మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. డబ్బు, బంగారం, ఆస్తి అన్నీ అడగడం మామూలే.కానీ ఇక్కడ మాత్రం ఓ కుటుంబం మాత్రం ఏకంగా కోడలి కిడ్నీనే కట్నంగా అడిగింది.అందుకు కోడలు ఒప్పుకోక పోవడంతో ఆమెను చితకబాది చావగొట్టారు. బిహార్ (Bihar) రాష్ట్రం ముజఫర్‌పుర్ జిల్లాలోని మిఠన్‌పురా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
2021లో మిఠన్‌పురాకు చెందిన దీప్తి అనే యువతి, బోచహాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. మొదటి కొన్ని నెలలు అన్నీ సజావుగా సాగినా, పెళ్లి తర్వాత త్వరలోనే దీప్తికి అత్తింటి వాతావరణం కఠినంగా మారింది. అత్త, మామలు అదనంగా డబ్బులు, బైక్ వంటి వరకట్నాలు ఇవ్వాలని కోరుతూ ఆమెను వేధించసాగారు.
ఈ వేధింపుల నడుమే దీప్తికి మరో భారీ షాక్ ఎదురైంది. ఆమె భర్త కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడటం ప్రారంభమైంది. వైద్యులు ఒక కిడ్నీ సరిగ్గా పనిచేయటం లేదని తెలిపారు. దీనిని ఆసరాగా తీసుకున్న అత్తమామలు, దీప్తిని కిడ్నీని దానం చేయమంటూ ఒత్తిడి మొదలుపెట్టారు. ఆమె అంగీకరించకపోతే తీవ్రంగా వేధించారు.
దీన్ని తట్టుకోలేని దీప్తి తన పుట్టింటికి వెళ్లి, అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు రాజీ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి, దీప్తి భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు.
ఈ సంఘటన మరోసారి వరకట్నం పేరుతో మహిళలు ఎలాంటి మానసిక, శారీరక హింసకు గురవుతున్నారన్న దాన్ని హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా కిడ్నీ లాంటి శరీర భాగాన్ని వరకట్నంగా అడగడం సమాజం ఎంత కఠినంగా ఉందో సూచిస్తోంది.