గెలిస్తే తొలి సంతకం ఆ ఫైలు మీదే: మహాగట్ బంధన్ మేనిఫెస్టో ఇదే

By Siva KodatiFirst Published Oct 17, 2020, 3:30 PM IST
Highlights

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగట్‌ బంధన్ (మహా కూటమి) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే, వ్యవసాయ చట్టాలను రద్దుచేసే బిల్లుపైనే మొదటి సంతకం ఉంటుందని స్పష్టం చేసింది

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగట్‌ బంధన్ (మహా కూటమి) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే, వ్యవసాయ చట్టాలను రద్దుచేసే బిల్లుపైనే మొదటి సంతకం ఉంటుందని స్పష్టం చేసింది. యువతకు ఉద్యోగాల కల్పనను కూడా ప్రధానంగా ప్రస్తావించింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి మహాగట్ బంధన్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 243 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేసినట్లు కూటమి ప్రకటించింది. 

మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ విధాన సభలో మొదటి బిల్లును పాస్‌ చేస్తామన్నారు. బీజేపీ మూడు కూటములతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఒకటి ప్రజలకు కనిపించే జనతా దళ్‌యునైటెడ్‌తో, రెండోది ప్రజలు అర్థం చేసుకునే లోక్‌ జనశక్తి పార్టీ, మూడోది ఓవైసీ సాహె‌బ్‌తో అంటూ వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నుంచి ఎదురైన వ్యతిరేకతను దాటుకొని గత నెల కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.   

కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం తీరును తప్పుపట్టారు. వరదతో ప్రభావితమైన ప్రజలను పరామర్శించేందుకు ఇప్పటి వరకు కేంద్ర బృందం బిహార్‌లో పర్యటించలేదని దుయ్యబట్టారు.

‘అధికారాన్ని చేజిక్కించుకునే పనిలో వారు బిజీగా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

click me!