
ముంబయి: 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ఏకతాటిమీదికి రావాలనే కాంక్ష ప్రబలమవుతున్నది. ఇందుకోసం బిహార్ సీఎం నితీష్ కుమార్ కంకణం కట్టుకున్నారు. స్వయంగా ఆయనే పలువురు ప్రతిపక్షనేతలను కలిసి విపక్షాల ఐక్యతపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా, బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు ఇద్దరూ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ రోజు వారిద్దరూ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో సమావేశం కాబోతున్నారు.
మంగళవారమే నితీష్ కుమార్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం అయ్యారు. భువనేశ్వర్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ రోజు నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ ఇద్దరూ శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో ముందు సమావేశం అవుతున్నారు. బాంధ్రాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతో శ్రీ’లో ఈ భేటీ జరగనుంది. అక్కడే వారిద్దరూ లంచ్ చేయనున్నారు.
Also Read: ‘బుద్ధం శరణం గచ్ఛామి’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి..
ఆ తర్వాత నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ దక్షిణ ముంబయిలోని శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’కు వెళ్లుతారు. అక్కడే శరద్ పవార్‌తో భేటీ కానున్నారని జేడీయూ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ వివరించారు.
2024 జనరల్ ఎలక్షన్‌లో విపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే బీజేపీని ఎదుర్కోవచ్చని నితీష్ కుమార్ భావిస్తున్నారు. ఈ మేరకే ఆయన కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు.