పెట్రోల్ భారం సామాన్యుడిపై పడదు.. ఇలా చేయండి: బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 20, 2021, 3:32 PM IST
Highlights

పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న వేళ ఓ బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదని.. ఎందుకంటే వారు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కువగా వాడతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న వేళ ఓ బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదని.. ఎందుకంటే వారు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కువగా వాడతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే.. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నారాయణ్ పటేల్‌ శనివారం ఇంధన ధరలపై స్పందిస్తూ.. సామాన్యులు ప్రజా రవాణా వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడతారని, చాలా కొద్దిమంది మాత్రమే సొంత వాహనాలు వాడతారని చెప్పారు.

అందువల్ల సామాన్యులపై పెట్రోల్ భారం పడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు తప్ప సామాన్యులు కార్లు వాడకపోవడం మంచిదంటూ నారాయణ్ ఉచిత సలహా ఇచ్చారు. 

అయితే నారాయణ్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని హాట్ హాట్‌గా మార్చేశాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పెట్రో ధరల పెంపుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్‌ మీద వచ్చిన సంగతి తెలిసిందే. పెట్రో ధరల పెంపు పట్ల నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ఉత్పత్తి కోతలను తగ్గించాలని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒపెక్, అనుబంధ చమురు ఉత్పత్తిదారులను కోరారు. 

click me!