నితిశ్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్: బిహార్ లో మొదలైన తొలివిడత పోలింగ్

By Arun Kumar PFirst Published Oct 28, 2020, 8:03 AM IST
Highlights

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక నిబంధనల మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. 

పాట్నా: మూడు విడతల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్ బుధవారం ఉదయమే ప్రారంభమయ్యింది. రాష్ట్రంలోని  మొత్తం 243 స్థానాలకు గాను ఈ తొలి దశలో 71 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 2 కోట్ల మందికి పైగా ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకుని అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక నిబంధనల మధ్య పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1000 నుంచి 1600 మంది ఓటర్లు మాత్రమే ఓటేసేలా ఏర్పాట్లు చేశారు. 

ఈ ఎన్నికల్లో జనతా దళ్(యు)-బిజెపి కూటమి విజయం ద్వారా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని నితీశ్ కుమార్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతడికి ప్రత్యర్థి ఆర్జేడి పార్టీ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తేజస్వి యాదవ్ నిరుద్యోగులను ఆకర్షించేందుకు 10లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుండి సొంత రాష్ట్రానికి తిరిగివచ్చిన ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని తేజస్వి ఈ హామీ ఇచ్చారని... కాబట్టి ఇది తమకు విజయాన్ని అందిస్తుందని ఆర్జేడి నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

తొలి దశ ఎన్నికల్లో అధికార జేడీయూ 35 చోట్ల, మిత్రపక్షం బిజెపి 29 చోట్ల బరిలో నిలిచింది. అలాగే ప్రతిపక్ష ఆర్జేడీ 42 చోట్ల, కాంగ్రెస్‌ 20 చోట్ల తమ అభ్యర్థులను నిలిపింది. చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ 41 చోట్ల పోటీ చేస్తుండగా.. అందులో 35 స్థానాల్లో జేడీయూతోనే ప్రధాన పోటీ నెలకొంది. రాజకీయ విభేదాల నేపథ్యంలో రాష్ట్రంలో నితీశ్‌లేని ప్రభుత్వం ఏర్పాటుకావాలంటూ చిరాగ్‌ పాసవాన్‌ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.


 

click me!