లవ్ జిహాద్ కోణం.. వాళ్లని ఎన్‌కౌంటర్ చేయాల్సిందే: హర్యానా విద్యార్ధిని తల్లిదండ్రులు

By Siva KodatiFirst Published 27, Oct 2020, 9:47 PM
Highlights

హర్యానాలోని ఫరీదాబాద్‌లో డిగ్రీ విద్యార్ధిని నిఖితా తోమర్ హత్య కేసు ఆ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఇస్లాంలోకి మారమని తమ కుమార్తెను నిందితుడు తౌసెఫ్ వేధించినట్లుగా బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది

హర్యానాలోని ఫరీదాబాద్‌లో డిగ్రీ విద్యార్ధిని నిఖితా తోమర్ హత్య కేసు ఆ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఇస్లాంలోకి మారమని తమ కుమార్తెను నిందితుడు తౌసెఫ్ వేధించినట్లుగా బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది.

ఆమె దారుణ హత్య వెనుక ప్రధాన కారణం ‘ లవ్ జిహాద్ ’ అని వాదిస్తున్నారు. తన డిమాండ్‌ను నిరాకరించడంతో పాటు అతని స్నేహాన్ని సైతం నిఖిత తిరస్కరించినందువల్లే తౌసెఫ్ ఆమెను హతమార్చాడని వారు చెబుతున్నారు.

మరోవైపు నిఖిత కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలని కోరుతూ ఆమె స్నేహితులు, స్థానికులు, ప్రజా సంఘాలు రోడ్డెక్కారు. కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి, తెలంగాణ దిశ కేసులో పోలీసులు అనుసరించినట్లుగానే తౌసెఫ్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది.

నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు తమ కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించబోమని వారు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన గంటల తర్వాత నిందితులు తౌసెఫ్, రెహన్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ‘ లవ్ జిహాద్ ’ అంశాన్ని కొట్టిపారేయలేమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, సోహ్నాకు చెందిన తౌసెఫ్ తమ కుమార్తెను వివాహం చేసుకుంటానని వేధిస్తున్నాడని.. ఇందుకు గాను మతం మార్చుకోవాలని ఒత్తడి చేస్తున్నట్లు నిఖిత కుటుంబసభ్యులు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు భల్లాబ్‌ఘర్ ఏసీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడానికి హర్యానా పోలీసులు ఏర్పాటు చేసిన 10 మంది సభ్యుల సిట్ బృందం ఇద్దరు నిందితులను మేవాట్‌లో వారిని పట్టుకున్నారు.

ఘటనకు కొద్ది నిమిషాల ముందు నిందితుడు తౌసెఫ్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, ఆగ్రహంతో ఊగిపోయిన తౌసెఫ్.. నిఖితను కాల్చి చంపాడు.

మరోవైపు ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. తెలుగు రంగు ఐ 20 కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి నిఖితను పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయితో వాగ్వాదానికి దిగాడు.

ఈ సమయంలో ఆమెను కిడ్నాప్ చేసేందుకు గాను కాలేజీ గేటు దగ్గర నిలిపి వుంచి కారులోకి లాగేందుకు యత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో, వారిలో ఒకరు రివాల్వర్ తీసి నిఖితను కాల్చి చంపాడు.

మధ్యాహ్నం నిఖిత పరీక్ష రాసి తిరిగి వస్తుండగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య తర్వాత నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు రక్తపు మడుగులో పడివున్న నిఖితను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. తౌసెఫ్ నోవాలో దాక్కోవడానికి ప్రయత్నించాడు.

అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పాల్వాల్ నుంచి మేవాట్ వరకు వున్న అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించి కేవలం ఐదు గంటల్లో నిందితులను పట్టుకున్నారు. నిఖిత హత్యపై జాతీయ మహిళా కమీషన్ (ఎన్‌సీడబ్ల్యూ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటాగా తీసుకుని.. నిందితులను త్వరగా పట్టుకోవాలని హర్యానా డీజీపీకి లేఖ రాసింది. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 27, Oct 2020, 11:07 PM