ఏషియానెట్ న్యూస్‌కు భారీ విజయం: వార్త రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను జైలులో పెట్టలేమన్న కోర్టు..

By Sumanth KanukulaFirst Published Mar 19, 2023, 11:37 AM IST
Highlights

ఏషియానెట్ న్యూస్‌ జర్నలిస్టులు చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం లభించింది. వార్తను రిపోర్టు చేసినందుకు జర్నలిస్టులను క్రిమినల్ నేరాలలో జైలుకు పంపలేమని కోజికోడ్ అదనపు సెషన్స్ కోర్టు పేర్కొంది.

ఏషియానెట్ న్యూస్‌ జర్నలిస్టులు చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం లభించింది. వార్తను రిపోర్టు చేసినందుకు జర్నలిస్టులను క్రిమినల్ నేరాలలో జైలుకు పంపలేమని కోజికోడ్ అదనపు సెషన్స్ కోర్టు పేర్కొంది. ఏషియానెట్ న్యూస్ ఉద్యోగుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పునిస్తూ కోర్టు ఈ కామెంట్ చేసింది. కోజికోడ్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ప్రియా కె మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటిది జరగదని అన్నారు. ఏషియానెట్ న్యూస్ సిబ్బందిపై తీవ్రమైన ఆరోపణలు లేవని పేర్కొన్నారు. నేరం జరిగితే న్యాయమైన విచారణ ద్వారా నిరూపించాలని కూడా ప్రస్తావిస్తూ కీలక  వ్యాఖ్యలు చేశారు. 

వివరాలు.. ఏషియానెట్ న్యూస్ ప్రసారం చేసిన ‘‘నార్కోటిక్స్ ఈజ్ డైటీ బిజినెస్’’ అనే సిరీస్‌లోని ఒక సెగ్మెంట్‌పై ఎమ్మెల్యే పీవీ అన్వర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేయడంతో సంస్థ జర్నలిస్టులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సెగ్మెంట్ కల్పితమని ఆరోపించిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. పోలీసులు ఏషియానెట్ న్యూస్ కోజికోడ్ కార్యాలయంపై దాడులు నిర్వహించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు. 

ఏషియానెట్ న్యూస్ జర్నలిస్టుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అనుమతిస్తూ కోజికోడ్ అదనపు జిల్లా సెషన్స్ చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ పిటిషనర్లపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద పరిగణించినట్లుగా.. ఘోరమైన నేరాల ఆరోపణలు లేవు. ఓ న్యూస్ ఛానల్ అధికారులు.. ఓ వార్తను ప్రసారం చేసినందుకు తమను జైల్లో పెడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్‌కు స్వేచ్ఛనిచ్చే భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రెస్, మీడియా, మీడియా సిబ్బందిని క్రిమినల్ నేరాల ఆరోపణలపై జైలులో పెట్టలేరు. వారు ఏదైనా నేరం చేసినట్లయితే అది న్యాయమైన విచారణ తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది’’ అని కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది. 


‘‘పరిశోధన అధికారికి విచారణ నిమిత్తం పిటిషనర్ల హాజరు అవసరం అయితే.. దర్యాప్తు అధికారి ముందు పిటిషనర్ల హాజరు భరోసా కోసం ఒక షరతు విధించవచ్చు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. అలాగే ఆరోపణ స్వభావం, శిక్ష తీవ్రత, నేరాన్ని నమోదు చేసే విధానం, పిటిషనర్లు దర్యాప్తులో జోక్యం చేసుకోవడం, సాక్షులను ప్రభావితం చేయడం, న్యాయం నుండి తప్పించుకునే సుదూర అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు’’ అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏషియానెట్ న్యూస్ జర్నలిస్టులు సింధు సూర్యకుమార్, షాజహాన్, నఫల్ బిన్ యూసఫ్, నీలి ఆర్ నాయర్‌లకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏషియానెట్ న్యూస్ ఉద్యోగుల ముందస్తు బెయిల్‌ పిటిషన్ విచారణ సందర్భంగా.. వారి తరపున న్యాయవాది పీవీ హరి కోర్టుకు హాజరయ్యారు. 

ఇక, పోలీసులు కోజికోడ్‌లోని ఏషియానెట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడానికి ముందు.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) మద్దతుగల స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) సభ్యులు ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి అక్కడ ఉన్న జర్నలిస్టులను దుర్భాషలాడటంతో పాటుగా బెదిరింపులకు దిగిన సంగతి  తెలిసిందే. ఏషియానెట్ న్యూస్‌పై కేరళ పోలీసుల చర్యను రాష్ట్రంలోని జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు.

click me!