
ప్రముఖ బనారస్ హిందూ యూనివర్సిటీలో (Banaras Hindu University ) ఏర్పాటు చేసిన విజువల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ (visual arts exhibition) పెను వివాదానికి దారితీసింది. ఇందుకు ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన పని కారణమైంది. వివరాలు.. బనారస్ హిందూ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. అయితే విజువల్ ఆర్ట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్రేష్ కుమార్.. తన చిత్రాన్ని శ్రీ రాముడి పెయింటింగ్‌పై, తన భార్య చిత్రాన్ని సీతా దేవి పెయింటింగ్‌పై ఉంచారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్రేష్ కుమార్ చేసిన ఈ పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు విద్యార్థులు.. అమ్రేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతడు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరించాడని ఆరోపిస్తున్నారు.
మరోవైపు అమ్రేష్ కుమార్ మాత్రం ఇదేమి పెద్ద విషయం కాదని అన్నారు. శ్రీరాముడు అందరికీ చెందినవారని పేర్కొన్నారు. అయితే ఇలా ఎందుకు చేశారనే ఇతర ప్రశ్నలకు మాత్రమం అతడు సమాధానం చెప్పలేదు. ఈ వివాదంపై బనారస్ హిందూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు అమ్రేష్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు.