ఆదిలోనే హంసపాదు.. మహారాష్ట్రలో  బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ 

Published : Apr 30, 2023, 10:34 AM IST
ఆదిలోనే హంసపాదు.. మహారాష్ట్రలో  బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ 

సారాంశం

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లోని భోకర్‌ తాలూకాలో జరిగిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ భోకర్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరా పరాజయం పాలైంది.  ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు.  

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం కేసీఆర్ తన పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లోని భోకర్‌ తాలూకాలో జరిగిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు. ఈ మేరకు ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను బరిలో దించారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్టు..బీఆర్ఎస్ ఏదో ఊహిస్తే.. ఏదో జరిగినట్టు అయింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు బావుటాను ఎగరవేస్తామనుకున్న బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తలిగింది.

ఎవ్వరూ ఊహించని విధంగా ఘోర పరాజయం పాలైంది. 18 డైరెక్టర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు. శనివారం జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ మద్దతుదారులకు 13, ఎన్సీపీ మద్దతుదారులకు 2, బీజేపీ మద్దతుదారులకు మూడు డైరెక్టర్‌ పదవులను కైవసం చేసుకున్నారు.  రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు లాంటి పథకాలు వంటి పలు హామీలు ఇచ్చిన ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది. 

ఫలించని వ్యూహం 

ఇటీవల భోకర్‌మార్కెట్‌పై పట్టున్న కాంగ్రెస్ నాయకుడు నాగ్‌నాథ్‌ సింగ్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. అతన్ని సహకారంతో మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో గెలుపు జెండాను ఎగరవేయాలని బీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేసింది. ఈ పరిణామంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన(ఉద్ధవ్‌ వర్గం), బీజేపీ, బీఆర్‌ఎస్‌కి మధ్య  పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు  భావించారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ మార్కెట్‌ మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ నియోజకవర్గం(భోకర్‌)పరిధిలోకి వస్తుంది. దీంతో ఆయన కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్‌ పాటిల్‌ చికిల్కర్‌ కూడా వారం రోజుల పాటు భోకర్‌లోనే ఉంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 

ఇదిలాఉంటే.. కొంతకాలంగా మహారాష్ట్ర రాజకీయాలో బీఆర్‌ఎస్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన భోకర్‌, కిన్వట్‌, దెగ్లూర్‌, హిమాయత్‌నగర్‌, ధర్మాబాద్‌, ముద్ఖేడ్‌, నయీగావ్‌లను ఫోకస్ చేసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జట్లుగా విడిపోయి భారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. తెలంగాణ పథకాలపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

ఇటీవల బీఆర్‌ఎస్‌ చీఫ్‌ సీఎం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగారు. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని సంచలన ప్రకటించారు. ఈ క్రమంలో భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో 18 మంది అభ్యర్థులు బరిలో దిగారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపిస్తే.. తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ.. వారు ఎన్ని ఉచిత హామీలచ్చినా.. ఫలితం మాత్రం శూన్యం. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో బీఆర్ఎస్ ఉనికిపై ప్రశ్నార్థకంగా మారింది. 

ఈ మార్కెట్‌ ప్రత్యేకత ఏమిటీ?

నాందేడ్‌ జిల్లాలోనే భోకర్‌ మార్కెట్‌ అతిపెద్ద మార్కెట్. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ మార్కెట్‌ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ మార్కెట్‌ పరిధిలో 64 గ్రామాలు ఉన్నాయి.ఈ మార్కెట్‌ లో 15 కోల్డ్‌ స్టోరేజీలున్నాయి. ఈ మార్కెట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ ప్రాంతంలో సజ్జలు, జొన్నలు, శనగలు, పెసలు, సోయా, నువ్వులు, కందులు, గోధుమలు, పొద్దుతిరుగుడు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..