రైస్ ధరల కట్టడి : కేంద్రం సంచలన నిర్ణయం , మార్కెట్‌లోకి ‘‘ Bharat Rice ’’.. రూ.25కే కిలో బియ్యం

By Siva Kodati  |  First Published Dec 27, 2023, 2:47 PM IST

దేశంలో అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలను హెచ్చరించింది. భారత్ బ్రాండ్ కింద ‘‘భారత్ రైస్’’ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. దీని ధర రూ.25గా నిర్ణయించారు.


ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు భారత్ బ్రాండ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా భారత్ ఆటా, భారత్ డాల్‌‌లను మోడీ సర్కార్ ప్రారంభించింది. తాజాగా ఈ భారత్ బ్రాండ్ కింద ‘‘భారత్ రైస్’’ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. దీని ధర రూ.25గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు భారత్ రైస్ లాంచ్‌ను ధృవీకరించారు. ఎన్ఏఎఫ్‌ఈడీ (నేషనల్ అగ్రికల్చరరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) , ఎన్‌సీసీఎఫ్ (నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్), కేంద్రీయ భండార్ ద్వారా ఈ రైస్‌ను విక్రయించనున్నారు. 

మరోవైపు.. దేశంలో అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలను హెచ్చరించింది. బాస్మతీయేతర బియ్యం కిలో రూ.50కి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాపారులకు కిలో రూ.27కు అందుబాటులో వుంచుతామని, దానిని నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్ ఆటాను రూ.27.50కి, శెనగపప్పును రూ.60కి అందిస్తోంది.

Latest Videos

ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా రిటైల్ పాయింట్స్‌లో విక్రయిస్తున్నారు. భారత్ రైస్‌ను కూడా ఇదే తరహాలో ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ధరల స్థిరీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సైతం మార్కెట్‌లో బియ్యం లభ్యతను మెరుగుపరిచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (ఓఎంఎస్ఎన్) కింద బియ్యను అందజేస్తోంది.

ఇకపోతే.. దేశంలో 15 ఏళ్ల రికార్డుని బద్ధలుకొట్టే స్థాయిలో రైస్ ధరలు నమోదయ్యాయి. ఒక్క నవంబర్ నెలలోనే కనీసం 10.3 శాతం మేర బియ్యం ధరలు పెరగ్గా, ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి చేరుకుంది. డిమాండ్‌కు తగిన విధంగా బియ్యం సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్ధితి చోటు చేసుకుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలో రూ.37.99గా వుండగా.. ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి అది రూ.43.51కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ చేరుకుంది. మరికొద్దినెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన బియ్యం ధరలు పెరిగితే ఇబ్బందులు తప్పవని భావించిన మోడీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. 

భారత్ ఆటా, భారత్ దాల్ పథకాలు సక్సెస్ కావడంతో బియ్యం విషయంలోనూ పై విధంగా స్కీమ్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత్ రైస్ పధకంతో పాటు లాభాల కోసం ఎవరైనా బియ్యం ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 
 

click me!