ట్రక్కు డ్రైవర్లకు మోడీ శుభవార్త .. త్వరలో హైవేలపై 1000 విశ్రాంతి కేంద్రాలు , ఫుల్ ఫెసిలిటీస్‌తో

By Siva Kodati  |  First Published Feb 2, 2024, 9:17 PM IST

దేశంలోని ట్రక్ , లారీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు వుండేలా ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు.


దేశంలోని ట్రక్ , లారీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పాల్గొన్న మోడీ ప్రసంగిస్తూ.. ఆటోమోటివ్ ఎకోసిస్టమ్‌లో డ్రైవర్ల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించిన ప్రధాని..డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి త్వరలో 1000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు వుండేలా ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

మొబిలిటీ సెక్టార్‌లో డ్రైవర్లు పెద్ద భాగమని.. ట్రక్కులు, ట్యాక్సీలు నడిపేవారు గంటల తరబడి డ్రైవిగ్ చేస్తారని, వారికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదన్నారు. వారు కూడా రోడ్డు ప్రమాదాల బాధితులేనని , ఈ ఆందోళనలను తమ ప్రభుత్వం అర్ధం చేసుకుందని మోడీ చెప్పారు. విశ్రాంతి కేంద్రాల ద్వారా డ్రైవర్లు సులభంగా జీవించడానికి, ప్రయాణించడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ అద్భుతమైన ఈవెంట్‌ను నిర్వహించినందుకు ఆటోమోటివ్ పరిశ్రమకు ఆయన అభినందనలు తెలియజేశారు. తాను అన్ని స్టాల్స్‌కు వెళ్లలేకపోయానని.. కానీ తాను చూసిన స్టాల్స్ చాలా బాగున్నాయని మోడీ ప్రశంసించారు. తానెప్పుడూ కారు కొనలేదని, కనీసం సైకిల్ కూడా కొనలేదని అందుకే తనకు పెద్దగా ఈ విషయాలపై అవగాహన లేదని ప్రధాని చెప్పారు. 

Latest Videos

undefined

ప్రధానిగా తన మొదటి విడతలో గ్లోబల్ లెవల్ మొబిలిటీ కాన్ఫరెన్స్‌ని ప్లాన్ చేశానని.. సెకండ్ టర్మ్‌లో ఎంతో పురోగతిని చూస్తున్నానని నరేంద్ర మోడీ చెప్పారు. తెలివైన వ్యక్తికి చిన్న సూచన సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని సాకారం చేయడంలో మొబిలిటీ రంగం కీలకపాత్ర పోషిస్తుందని మోడీ ఆకాంక్షించారు. ఎర్రకోట ప్రాకారాల మీద నుంచి 'Yahi Samay, Sahi Samay hai' అనే మాటను అన్నానని.. దేశ ప్రజల సామర్ధ్యాల వల్లే ఆ మాటలు అన్నానని ప్రధాని తెలిపారు. నేడు భారత ఆర్ధిక వ్యవస్ధ వేగంగా విస్తరిస్తోందని.. మన ప్రభుత్వ హయాంలో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించనుందని మోడీ ఆకాంక్షించారు. 

సాధారణంగా 11 నుంచి 12 గంటల పాటు ప్రయాణించే డ్రైవర్లకు సౌకర్యవంతంగా వుండటానికి 2025 నుంచి అన్ని ట్రక్కు క్యాబిన్‌లు ఎయిర్ కండీషనింగ్ చేయబడాలని గతేడాది కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. మనదేశంలో కొందరు డ్రైవర్లు 12 నుంచి 14 గంటల పాటు డ్రైవింగ్ చేస్తూనే వుంటారని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో బస్సు, ట్రక్కు డ్రైవర్లు డ్యూటీలో వుండటానికి పరిమితి వుందని, మనదేశంలో డ్రైవర్లు 43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా వాహనాలను నడుపుతారని కేంద్ర మంత్రి చెప్పారు. అలాంటప్పుడు డ్రైవర్ల పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించాలన్నారు. 

click me!