క్లిష్ట పరిస్ధితుల్లో తీపికబురు: టీకా ఉత్పత్తిని పెంచుతున్నాం.. భారత్ బయోటెక్ ప్రకటన

By Siva KodatiFirst Published Apr 20, 2021, 7:09 PM IST
Highlights

భారత్‌ బయోటెక్‌ తన కొవాగ్జిన్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 70 కోట్లు డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఈ మేరకు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది

కరోనా సెకండ్‌ వేవ్‌ భారతదేశంలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు అందుబాటులో వున్న అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో టీకా ఒక్కటే కోవిడ్‌ ఉద్థృతిని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే దేశంలో వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. మార్చి మధ్య నాటికి టీకా తీసుకునేవారి సంఖ్య అంతంత మాత్రంగానే వుండేది. ఎప్పుడైతే దేశంలో కేసుల సంఖ్య పెరిగిందో అప్పటి నుంచి జనం వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎగబడ్డారు.

దీంతో టీకాకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. డిమాండ్‌కు సరిపడా ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ అందించలేక చేత్తులెత్తేశాయి. అయితే ప్రభుత్వాలు టీకా ఉత్పత్తి సామర్ధ్యం పెంచాలని వాటిపై ఒత్తిడి తీసుకొచ్చింది.

అలా చేయాలంటే ప్రభుత్వ ఆర్దిక సాయం తప్పనిసరని భారత్ బయోటెక్ తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం భారీగా ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. దీంతో భారత్‌ బయోటెక్‌ తన కొవాగ్జిన్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ప్రకటించింది.

Also Read:షాకింగ్ : 44 లక్షల డోసుల టీకాలు వృధా !?

ఏడాదికి 70 కోట్లు డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఈ మేరకు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవాగ్జిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అవసరమైన ముడిపదార్థాలు ప్యాకింగ్‌ సామాగ్రి సమకూర్చుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. క్రమక్రమంగా కొవాగ్జిన్ తయారీని పెంచుతున్నామని, వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం పెంపు ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ బీఎస్ ఎల్ 3 తయారీ యూనిట్లు అందుబాటులో ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఉత్పత్తి పెంపు సాధ్యపడిందని వివరించింది.

టీకా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెంచేందుకు వీలుగా వాణిజ్య స్థాయిలో వ్యాక్సిన్‌ తయారీ అనుభవం ఉన్న ఇండియన్ ఇమ్యూనలాజిక్స్‌తో భాగస్వామ్యం వల్ల సాంకేతిక బదిలీ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొంది. విదేశాల్లో కూడా అనుభవంతో కూడిన తయారీ భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది.

దిగుమతులపై ఆధారపడకుండా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగించే ఐఎమ్ డీజీ అగోనిస్ట్ మాలిక్యూల్స్‌ను విజయవంతంగా తయారీ చేస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. వాణిజ్య స్థాయిలో ఈ మాలిక్యూల్స్ ఉత్పత్తి భారత్‌లో ఇదే మొదటి సారని పేర్కొంది. 

click me!