
UP Assembly Election 2022: UP Assembly Election 2022: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 7 దశల్లో జరగనున్న యూపీ ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్ గురువారం 7 గంటలకు ప్రారంభమైంది. 11 నెలల రైతుల నిరసన కేంద్రమైన రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మొదటి దశలో పశ్చిమ యూపీలోని 11జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు ఈ మొదటి దశలో పోటీలో నిలిచారు. అన్ని పార్టీలు మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మొదటి దశలో పశ్చిమ యూపీలోని 11జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ఓటింగ్ కు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు తప్పు చేస్తే ఉత్తరప్రదేశ్.. మరో కాశ్మీర్, కేరళ లేదా బెంగాల్ గా మారవచ్చు అంటూ హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో మొదటి రౌండ్ ఎన్నికలకు గంటల ముందు మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) ఓటు వేయాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను ఉత్తరప్రదేశ్ బీజేపీ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బీజేపీకి ఓటు వేస్తే.. సురక్షితమైన.. భయరహిత జీవనానికి హామీ ఉంటుందని పేర్కొన్నారు.
"నా మనసులో ఉన్న విషయం నీకు చెప్పాలి. ఈ ఐదేండ్లలో చాలా అద్భుతాలు జరిగాయి. జాగ్రత్త ! ఆదమరిస్తే.. ఈ ఐదేండ్ల శ్రమ వృధాఅవుతుంది. దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఉత్తరప్రదేశ్.. మరో కాశ్మీర్, కేరళ లేదా బెంగాల్ గా మారవచ్చు’’ అని యోగి ఆదిత్యనాథ్ వీడియోలో పేర్కొన్నారు.‘ఐదేళ్ల నా శ్రమకు మీ ఓటు దీవెన.. మీ ఓటు కూడా మీ నిర్భయ జీవితానికి గ్యారెంటీ’ అని అన్నారు. "ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. గత ఐదేళ్లలో, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంకితభావం, నిబద్ధతతో ప్రతిదీ చేసింది. మీరు ప్రతిదీ చూశారు.. ప్రతిదీ వివరంగా విన్నారు. ఈ సారి కూడా బీజేపీకి ఓటు వేయండి" అని అన్నారు.
కాగా, ఈ సారి కూడా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించి రెండో సారి వరుసగా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ సైతం ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. బీజేపీ కి బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఇదిలావుండగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 412 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన దాదాపు 50,000 మంది పారామిలటరీ సిబ్బందిని (paramilitary security personnel) వివిధ ప్రాంతాల్లో మోహరించారు. రాష్ట్ర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. రేపు పోలింగ్ జరగనున్న 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది.
“ముజఫర్‌నగర్(Muzaffarnagar), అలీఘర్ (Aligarh), మీరట్ (Meerut) లలో అత్యధిక పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఒక్క మధురలో మాత్రమే 75 మంది పారామిలటరీ కాయ్‌లను మోహరించారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 21,000 మందిని మోహరించారు”అని భద్రతా అధికారులు పేర్కొన్నారు. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతాలు కావడంతో అధికంగా బలగాలను మోహరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా నిఘా పెంచినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్యానా (Haryana), రాజస్థాన్ (Rajasthan) రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు మోహరించి.. వాహనాల నెంబర్లు, సంబంధిత వివరాలను నమోదుచేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య, పోలింగ్ అధికారులు, ఎన్నికల బృందాలు బుధవారం ఉదయం 7 గంటల నుండి అవసరమైన అన్ని ఎన్నికల సామగ్రిని సేకరిస్తున్నట్టు తెలిపారు.