
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న 189 మందితో బీజేపీ తన తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత కల్పించారు కమలనాథులు. వీరిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వున్నారు. ఈ క్రమంలో అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరు నగర మాజీ పోలీస్ కమీషనర్ భాస్కరరావు. ఈయనకు చామరాజపేట్ నుంచి అవకాశం కల్పించారు బీజేపీ పెద్దలు.
ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు భాస్కర్ రావు .. బెంగళూరులోని దొడ్డ గణపతి ఆలయంలో పూజలు చేశారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. పట్టణ కేంద్రాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో.. ఇంటింటికి తిరిగి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానని భాస్కర్ రావు వెల్లడించారు.
ఇదిలావుండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ నిరాకరించడంపై బెళగావి నార్త్ కు చెందిన సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బెణకే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన మద్ధతుదారులతో కలిసి నిన్న నిరసనకు దిగారు. అలాగే మహదేవప్ప యాదవ్‌కు టికెట్ నిరాకరించడంపై బెళగావిలోని రామదుర్గ్ నియోజకవర్గంలో ఆయన మద్ధతుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన చిక్క రేవణ్ణకు టికెట్ దక్కింది.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న ప్రకటించిన 189 స్థానాలకు గాను 52 మంది సిట్టింగ్‌లను బీజేపీ పక్కనబెట్టింది. అలాగే ఎనిమిది మంది మహిళలు, 9 మంది వైద్యులు, ఐదుగురు లాయర్లు, ఒక రిటైర్డ్ ఐపీఎస్, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, 8 మంది సామాజిక కార్యకర్తలకు టికెట్లు ఇచ్చామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడంతో .. హైకమాండ్ ఆయనను ఢిల్లీకి పిలిపించింది. అయితే దివంగత కేంద్ర మంత్రి అనంత్ కుమార్ భార్యకు కూడా టికెట్ నిరాకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాకపోతే.. ఆమెకు రానున్న కాలంలో పార్టీలోనే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు వున్నాయని సమాచారం. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.