సోషల్ మీడియాలో పోస్టు: ఎమ్మెల్యే మేనల్లుడి అరెస్ట్, సీఎం ఆగ్రహం

By narsimha lodeFirst Published Aug 12, 2020, 10:30 AM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన  కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు నవీన్ ను పోలీసులు బుధవారం నాడు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన  కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు నవీన్ ను పోలీసులు బుధవారం నాడు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు షేర్ చేసినందుకు గాను ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి చోటు చేసుకొంది. ఎమ్మెల్యే ఇంటిని కూడ ఆందోళనకారులు దగ్ధం చేశారు. 

మంగళవారం నాడు అర్ధరాత్రి శ్రీనివాసమూర్తి ఇంటికి సమీపంలో పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ పార్క్ చేసిన వాహనాలను ఎమ్మెల్యే ఇంటిని దుండగులు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పోలీసుల వాహనాలను కూడ ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ సంఘటన స్థలానికి చేరుకొన్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు 110 మందిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.అదనపు పోలీస్ కమిషనర్ కూడ ఈ ఘటనలో గాయపడ్డారు.అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని బెంగుళూరులో పట్టణంలోని డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు కర్ఫ్యూను విధించారు.

మరో వైపు తన సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేశారని నవీన్ చెబుతున్నారు. ఈ పోస్టు డీలీట్ చేశారు. అయితే ఈ పోస్టును ఎవరు పోస్టు చేశారనే విషయాన్ని తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటన చోటు చేసుకొన్న సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. ఓ వీడియో మేసేజ్ విధ్వంసానికి కారణమైందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. విధ్వంసం సమస్యకు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ ఘటనపై కర్ణాటక సీఎం యడియూరప్ప సీరియస్ అయ్యారు. విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు.


 

click me!