
ఓ మహిళపై ఉబర్ డ్రైవర్ దాడి చేసిన ఘటన బెంగళూరులో గురువారం వెలుగు చూసింది. ఈ ఘటన బెల్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగనహళ్లిలో బుధవారం చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త అజయ్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం తన కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మహిళ తన అపార్ట్‌మెంట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది.
కొంత సేపటి తరువాత క్యాబ్ బుక్ చేసిన ప్రాంతానికి కారు వెళ్లింది. అనారోగ్యంతో ఉన్న కొడుకుతో కలిసి క్యాబ్‌లో కూర్చొని ఉండగా.. మరో క్యాబ్ ఘటనాస్థలికి వెళ్లింది. అయితే.. తాను బుక్ చేసిన క్యాబ్ అది కాదని తెలుసుకున్న ఆ మహిళ కారు కిందకు దిగేందుకు ట్రై చేసింది. వేరే క్యాబ్ లో వెళ్లాలని ప్రయత్నించింది.
ఆ సందర్బంలో ఆ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళను అడ్డగించాడు. ఆ ప్రయాణికురాలిపై రెచ్చిపోయాడు. అపార్ట్‌మెంట్ ఆవరణలో వివాహిత మహిళపై డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. తల్లిని కాపాడేందుకు వచ్చిన కొడుకుపై కూడా డ్రైవర్ దాడి చేశాడు. ఈ ఘటన మొత్తం అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి నుంచి మహిళను రక్షించారు. పోలీసులు విచారణ ప్రారంభించి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. ఉబర్ క్యాబ్ డ్రైవర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
ఆ క్యాబ్ డ్రైవర్ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..విచారిస్తున్నామని బెళ్లందూరు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో ఉబర్ సంస్థ ఇంత వరకు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.