ఆమె టెక్కీ, మోడల్.. అభిమాని అంటూ ఫేస్‌బుక్‌లో యువకుడి పరిచయం.. చివరకు విషాదం..

బెంగళూరులో టెక్కీ, మోడల్ అయిన యువతి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Google News Follow Us

బెంగళూరులో టెక్కీ, మోడల్ అయిన యువతి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన వ్యక్తిగత డైరీలో పోలీసులు చిక్కడం.. అందులో ప్రియుడు వేధిస్తున్నట్టుగా పేర్కొనడం ఈ కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఆమె ప్రియుడు జిమ్ కోచ్‌ అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. బాధితురాలు విద్యాశ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆమె సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ మాత్రమే కాకుండా మోడలింగ్‌లో కూడా ఉంది. అయితే అక్షయ్ తనను తాను ఆమె అభిమానిగా చెప్పుకుంటూ ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. 

ఆ తరువాత.. వారి మధ్య చాటింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఇరువురు డేటింగ్ ప్రారంభించారు. అయితే విద్యాశ్రీకి  సన్నిహితంగా  ఉన్న అక్షయ్.. ఆమె నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఆమె నుంచి అక్షయ్ దూరం జరిగాడు. అయితే ఈ నెల 21న బెంగళూరు ఉత్తర తాలూకాలోని కెంపపుర ప్రాంతంలో విద్యాశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు ఈ కేసును అన్నికోణాల్లో విచారించారు. విద్యాశ్రీ వ్యక్తిగత డైరీలో పేర్కొన్న అంశాలతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. అక్షయ్ తనను కుక్క తీరుగా ట్రీట్ చేశాడంటూ విద్యాశ్రీ తన డైరీలో పేర్కొందని పోలీసులు తెలిపారు. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడల్లా.. అక్షయ్ తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడాడని కూడా విద్యాశ్రీ  డైరీలో పేర్కొంది. ఆ అవమానంతో తాను జీవించలేనని ఆమె పేర్కొంది. ప్రేమలో పడవద్దని, ఎవరినీ నమ్మవద్దని ఆమె అమ్మాయిలను అభ్యర్థించింది.

విద్యాశ్రీ తన వ్యక్తిగత డైరీలో రాసిన డెత్ నోట్‌లో తన జీవితాన్ని ముగించడానికి నిందితుడు అక్షయ్ మాత్రమే కారణమని పేర్కొంది. ‘‘రూ. 1.76 లక్షల రుణాన్ని తిరిగి ఇవ్వమని అడిగిన తర్వాత అతను  మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. నేను రోజు రోజుకి ఒత్తిడికి గురవుతున్నాను. ఈ ప్రపంచానికి గుడ్ బై’’ అని బాధితురాలు పేర్కొంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా  పోలీసులు తెలిపారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)