స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్.. ఫ్రీగా ఇవ్వాలంటూ పట్టు: డెలివరీ బాయ్‌పై రాళ్ల దాడి, తోటివారు రాకపోయుంటే..?

By Siva KodatiFirst Published Jun 6, 2021, 11:11 PM IST
Highlights

స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడిన సంఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. మే 28న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడిన సంఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. మే 28న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల కార్తీక్ హరిప్రసాద్ అనే ఘటన జరిగిన రోజు సాయంత్రం నగరంలోని రాజాజీ నగర్‌కు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఫుడ్ ఆర్డర్ చేసిన నలుగురు వ్యక్తులు.. ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయాలని విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే కార్తీక్ డెలివరీ ఇవ్వడానికి వచ్చేశాడు. దీంతో వారు ఉచితంగా ఆహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు కార్తీక్ సమ్మతించకపోవడంతో నలుగురు కలిసి అతనిపై దాడికి తెగబడ్డారు. వసీమ్ అనే వ్యక్తి ఈ దారుణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీనితో పాటు ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పలువురు ఇచ్చిన విరాళాలను కార్తీక్ వైద్య ఖర్చులకు ఇవ్వనున్నారు వసీమ్.

కార్తీక్ తొలుత.. కస్టమర్లను ఫుడ్‌కి నగదు చెల్లించమని కోరగా వారు నిరాకరించారు. అక్కడితో ఆగకుండా తమకు ఫుడ్‌ను ఫ్రీగా ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే తనకు నగదు చెల్లించని పక్షంలో అవసరమైన వారికి ఆహారం ఇస్తానని తేల్చిచెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నలుగురు కుర్రాళ్లు... అతనిని అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు కార్తీక్‌పై దాడికి తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్తీక్ తలకు గాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మొత్తంగా ఈ ఘటనలో కార్తీక్ ఫోన్, బైక్,హెల్మెట్ కూడా దెబ్బతిన్నాయి. అన్నింటికిమించి తన తన సోదరి వివాహం కోసం (ఆదివారం జరిగింది) దాచుకున్న రూ. 1800 నగదును ఆ నలుగురు కుర్రాళ్లు అపహరించారు.

అయితే అదృష్టవశాత్తూ తోటి ఫుడ్ డెలివరీ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో కార్తీక్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. కార్తీక్‌పై దాడిని గమనించిన స్థానికులు భారీగా చేరుకోవడంతో నలుగురు కుర్రాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, తన సోదరి వివాహం వుండటంతో కార్తీక్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గాయంతోనే తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతని స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా. 

ఈ ఘటనపై కార్తీక్ మాట్లాడుతూ.. పోలీసులు తనతో నిరంతరం టచ్‌లోనే వున్నారని చెప్పాడు. తాను బుధవారం బెంగళూరుకు వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు. అదే సమయంలో కస్టమర్ వివరాలను పోలీసులతో పంచుకుంటామని స్విగ్గీ తెలిపినట్లు కార్తీక్ చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న పలువురు తనకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన వైద్యం, బైక్ రిపేర్ ఖర్చుల కంటే ఎక్కువగానే డబ్బు వచ్చిందని.. అయితే తన ఖర్చులు పోనూ మిగిలిన డబ్బును ఏదైనా మంచి కార్యక్రమానికి విరాళంగా ఇస్తానని కార్తీక్ పేర్కొన్నాడు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. కార్తీక్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

 

click me!