రైల్వే స్టేషన్‌లోకి నో ఎంట్రీ.. జనరల్ బుకింగ్ లేదు: లాక్‌డౌన్‌లో టికెట్‌ లేకుండా 27 లక్షల మంది జర్నీ!

By Siva KodatiFirst Published Jun 6, 2021, 9:11 PM IST
Highlights

గతేడాది దేశవ్యాప్తంగా 27 లక్షల మంది టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణించారని రైల్వే శాఖ లెక్కలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది.  

కరోనాను కట్టడి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతేడాది లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోగా. బస్సులు, రైళ్లు, విమానాలు వంటి సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఆ తర్వాత దేశంలో కేసులు తగ్గడంతో ప్రభుత్వం నెమ్మదిగా రైళ్లు, బస్సులకు అనుమతించింది. అయితే కరోనా భయంతో జనాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. ఇక్కడ రైల్వే శాఖ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గడిచిన ఏడాదిన్నరగా రైళ్లు పరిమితంగానే నడుస్తున్నాయి. 

దీనికి తోడు రైల్వే స్టేషన్‌లో జనరల్ బుకింగ్‌ను రద్దు చేశారు. ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేసి, ప్రయాణానికి కనీసం రెండు గంటల ముందు స్టేషన్‌కు రావాల్సి వుంటుంది. కన్ఫామ్‌ టికెట్‌ తప్పనిసరి. వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ ఉన్న వారికి లోపలికి నో ఎంట్రీ. ఇక థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు ఉంటే ప్రయాణానికి అనుమతి లేదు. ఇన్ని ఆంక్షల నేపథ్యంలో రైల్వేస్టేషన్లకు జనాల తాకిడి లేక అవన్నీ బోసిపోయాయి.

Also Read:కరోనాతో దేశం కకావికలం: రైల్వే శాఖ ఆపన్న హస్తం.. 64 వేల బెడ్లు సిద్ధం

అయితే అలాంటి సమయంలోనూ టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణించిన వారు లక్షల్లో ఉన్నారట. ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. గతేడాది దేశవ్యాప్తంగా 27 లక్షల మంది టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణించారని రైల్వే శాఖ లెక్కలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది.  

2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య మొత్తం 27.57 లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించారట. వారి నుంచి రూ.143.82 కోట్లు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విధంగా 1.10 కోట్ల మంది పట్టుబడడం విశేషం. అప్పటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగో వంతే అయినప్పటికీ కరోనా వేళా ఈ విధంగా ప్రయాణించడం గమనార్హం. అయితే అధికారులకు చిక్కని వారెందరో మరి!! 

click me!