నలుగురు ప్రాణాలు తీసిన తండ్రి వివాహేతర సంబంధం... బెంగళూరులో దారుణం..

By AN TeluguFirst Published Sep 20, 2021, 4:59 PM IST
Highlights

తమ ఆత్మహత్యకు తండ్రి శంకరన్ మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని కొడుకు మధుసాగర్ రాసిన డెత్ నోట్ పోలీసులు సోదాల్లో ఆదివారం ఉదయం బయటపడింది. 

బెంగళూరులో గత శుక్రవారం వెలుగుచూసిన ఒకే కుటుంబంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్య, మగ శిశువు మృతి కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. తమ ఆత్మహత్యకు తండ్రి శంకరన్ మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని కొడుకు మధుసాగర్ రాసిన డెత్ నోట్ పోలీసులు సోదాల్లో ఆదివారం ఉదయం బయటపడింది. 

తండ్రి వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రాశాడు. తన లాప్ టాప్ లో అన్ని వివరాలు ఉన్నట్లు తెలిపాడు. అలాగే కూతుళ్లు సించన, సింధూరాణి గదులలో లభించిన డెత్ నోట్స్ లోనూ తండ్రి వివాహేతర సంబంధం గురించి ప్రస్తావించారు. సించన అత్తవారింట్లో సంతోషం లేదని రాసింది. దీంతో లేఖలను, లాప్ టాప్ ను బ్యాడరహళ్లి పోలీసులు క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. 

శంకర్ ఇంట్లో సోదాల్లో దొరికిన కేజీ బంగారం, రూ.12 లక్షలు నగదును కూడా పోలీసులు సీజ్ చేసి ఇంటికి తాళాలు వేశారు. శంకర్ విజ్ఞప్తి మేరకు పంచనామా సమయంలో విజయనగర ఎసీపీ నంజుండేగౌడ నేతృత్వంలో సీఐ రాజీవ్ లు ఇంట్లోని ప్రతీ భాగాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. 

మృతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విశ్లేషించే పనిలో ఉన్నారు. అల్లుళ్లు ప్రవీణ్, శ్రీకాంత్ లను ప్రశ్నించారు. శంకర్ కుటుంబీకులే ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆయన మీద దృష్టి సారించారు. మరోవైపు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తన భార్యే గొడవలకు కారణమని శంకర్ రోధించాడు. 

కాగా, కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తమ ఇంట్లోని ఇద్దరు చిన్నారులను అలా వదిలేసి.. మిగిలిన సభ్యులంతా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో పెద్దవారు లేకపోవడంతో.. ఆకలికి తట్టుకోలేక ఓ చిన్నారి కన్నుమూయడం గమనార్హం. ఈ దారుణ సంఘటన బెంగళూరులోని తిగళరవాళ్య చేతన్ కూడలి లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిగళరపాళ్య చేతన్ కూడలిలో నివాసముండే శంకర్ అనే వ్యక్తి కుటుంబసభ్యులంతా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లాలని ఆయన తన కుమార్తెకు చెప్పడం వల్లే.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మొదట్లో అందరూ అనుకున్నారు. శంకర్ భార్య భారతి(50), ఆమె కుమార్తెలు సించన(33), సింధూ రాణి(30), కుమారుడు మధుసాగర(27) ఆత్మహత్య చేసుకున్నారు.

కుటుంబం మొత్తం బలవన్మరణం.. ఆకలితో చిన్నారి..!

సించన తొమ్మది నెలల కుమారుడు ఆకలి తాళలేక మరణించాడు. ఆమె కుమార్తె ప్రేక్ష(3) స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించన్ ను తండ్రి శంకర్ కోరుతున్నాడు. ఈ విషయంలో కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

తన మాట ఎవరూ వినడం లేదని శంకర్ ఆదివారం ఇంటి నుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో కాలం గడిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి అనుమానంతో కిటికీ నుంచి చూసి ఆయన నిశ్చేష్టులయ్యారు. కుటుంబీకులు 5 రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

click me!