బెంగళూరులో నేపాలి మహిళ హత్య కేసులో ట్విస్ట్ ... ఒడిశాలో శవమై తేలిన నిందితుడు

By Arun Kumar P  |  First Published Sep 25, 2024, 9:51 PM IST

ఐటీ సిటీ బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో శవమై తేలాడు 


Bengaluru Murder Case : బెంగళూరు నగరంలో ఇటీవల మహాలక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఈ హత్య అత్యంత కిరాతకంగా జరగడంతో సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా  అనుమానిస్తున్న ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో శవమై తేలాడు.  అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు

ఇటీవల బెంగళూరులోని వ్యాలికవల్‌లో నివాసముండే నేపాలీ మహిళ మహాలక్ష్మి హత్య కేసులో ముక్తి రంజన్ రాయ్ కీలక నిందితుడిగా బెంగళూరు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. మహాలక్స్మి హత్య తర్వాత పరారీలో ఉన్న రాయ్ ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని శ్మశానవాటిక సమీపంలో శవమై కనిపించాడు.

Latest Videos

undefined

హత్య తర్వాత అతను తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాడని... రాత్రి కుటుంబసభ్యులకు చెప్పి ఇంటినుండి బయటకు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. బైక్ పై బయలుదేరిన అతను ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ల్యాప్‌టాప్ అక్కడే పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధుసురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతని డైరీ, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు బెంగళూరులోని హెబ్బగోడి ప్రాంతంలో నివసిస్తున్నాడు. మల్లేశ్వరంలోని ఒక ఫ్యాషన్ స్టోర్‌లో పనిచేసేవాడు. అక్కడే మహాలక్ష్మితో అతనికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మహాలక్ష్మి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ ఉద్రిక్తతలే హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కుటుంబ కలహాల కారణంగా తన భర్తను విడిచి తొమ్మిది నెలల క్రితం మహాలక్ష్మి బెంగళూరుకు వచ్చింది. సేల్స్‌లో ఉద్యోగంలో చేరిన ఆమె.. త్వరలోనే రాయ్‌తో సన్నిహితంగా మారింది. వారి సంబంధం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే వారిమధ్య విబేధాలు మహాలక్ష్మి దారుణ హత్యకు దారితీసాయి. గతవారం వ్యాలికవల్‌లోని అద్దె ఇంట్లో ఫ్రిజ్‌లో ఆమె మృతదేహం 50 కంటే ఎక్కువ ముక్కలుగా నరికివేయబడి కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు.

ముక్తి రంజన్ రాయ్ ప్రధాన నిందితుడిగా గుర్తించిన బెంగళూరు పోలీసులు అతడిని పట్టుకునేందుకు భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. నేరానికి పాల్పడిన తర్వాత రాయ్ పశ్చిమ బెంగాల్‌కు పారిపోయి ఉంటాడని భావించారు. అక్కడ అతను తన సోదరుడిని కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతని జాడను అనుసరిస్తుండగా.. అతను ఆత్మహత్య చేసుకున్న వార్త రావడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది.

 కుళ్లిపోయిన స్థితిలో మహాలక్ష్మి మృతదేహం పోలీసులకు లభ్యమవడంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది. దర్యాప్తు ప్రకారం, ఆమె మృతదేహం లభ్యమయ్యే రెండు వారాల ముందే ఈ నేరం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద్ గతంలో ఈ కేసుపై స్పందిస్తూ.. నిందితుడిని గుర్తించామని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. "అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ప్రధాన నిందితుడిని గుర్తించాం. అతడిని అరెస్టు చేసేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

ఈ కేసు దారుణంగా జరగడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యతో అతని ఉద్దేశ్యం, సంఘటనలకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

click me!