ఉత్తర ప్రదేశ్ లో యోగి హవా .. ఒక్క లక్నోలోనే బిజెపి సభ్యత్వం ఎంతో తెలుసా?

By Arun Kumar PFirst Published Sep 25, 2024, 8:04 PM IST
Highlights

 పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా బిజెపి సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదుగురికి పార్టీ సభ్యత్వాన్ని కల్పించారు. దీంతో ఒక్క లక్నోలోనే బిజెపి సభ్యత్వం ఎంతకు చేరిందో తెలుసా? 

లక్నో : పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ ప్రధాత, గొప్ప తత్వవేత్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆయన దార్శనికత వల్లే పేద ప్రజలు, మారుమూల గ్రామాలు, రైతులు, మహిళలు రాజకీయ పార్టీల అజెండాలో భాగమయ్యారని అన్నారు. 60-70 ఏళ్ల క్రితమే దీనదయాళ్ ఉపాధ్యాయ్ భారతీయ రాజకీయాలకు ఓ దృక్పథాన్ని ఇచ్చారని ... ఆయన ఆలోచనలు నేటికీ భారత ప్రజాస్వామ్యంలోనే కాదు వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నాయని అన్నారు.

ఇవాళ (సెప్టెంబర్ 25) దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని యూపీ రాజధాని లక్నోలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చార్‌బాగ్ రోడ్డులో గల కెకెసి కళాశాల సమీపంలోని దీనదయాళ్ ఉపాధ్యాయ స్మారక చిహ్నం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం యోగి పాల్గొని నివాళి అర్పించారు.  దీన్ దయాళ్ విగ్రహానికి పూలమాల వేసారు యోగి. ఈ సందర్భంగా బిజెపి సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదుగురికి పార్టీ సభ్యత్వాన్ని కల్పించారు.

Latest Videos

గ్రామాలు, పేదలు, రైతులు, మహిళల అభ్యున్నతికే దీనదయాళ్ ఉపాధ్యాయ కృషి

మారుమూల గ్రామాలు, నిరుపేదలు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలు, మహిళలను స్వావలంబన దిశగా తీసుకెళ్లాలనే దీనదయాళ్ ఉపాధ్యాయ జీవితాంతం కృషి చేసారని సీఎం యోగి పేర్కొన్నారు. ఆ వర్గాల పట్ల ఆయనకు ఎంతో సానుభూతి ఉండేదని ... అందుకే ప్రతి చేతికి పని, ప్రతి పొలానికి నీరు అనేది ఆయన నినాదంగా పెట్టుకున్నారని అన్నారు. ఆర్థిక ప్రగతిని ఎగువ స్థాయిలో కాకుండా, దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తిని బట్టి అంచనా వేయాలని ఆయన అనేవారని యోగి గుర్తుచేసారు.

భారత రాజకీయ దృక్పథాన్నే దీనదయాళ్ ఉపాధ్యాయ మార్చేసారు

70 ఏళ్ల క్రితమే దీనదయాళ్ ఉపాధ్యాయ భారతీయ రాజకీయాలకు ఓ దృక్పథాన్ని కల్పించారని ... అదే నేటికి కొనసాగుతోందని సిఎం యోగి అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్, 12 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు, 10 కోట్ల ఇళ్లలో ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు, 12 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధి చేకూర్చడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సమాజాన్ని సమగ్ర అభివృద్ధి వైపు నడిపించడం, తద్వారా సాంస్కృతిక పురోగతి సాధించడం, దేశ సమగ్ర వికాసానికి తోడ్పాటు అందించడడం వంటివి దీన్ దయాళ్ దార్శనికతలోని అంశాలని వివరించారు.

కొత్త భారతాన్ని చూస్తున్నాం

ప్రధాని మోదీ నాయకత్వంలో దీన్ దయాళ్ దార్శనికతను గత పదేళ్లుగా అమలు చేస్తున్నామని ... దీంతో కొత్త భారతాన్ని చూస్తున్నామని సిఎం యోగి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బిజెపి దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని సభ్యత్వ ప్రచార కార్యక్రమం రోజుగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రతి బూత్‌లోనూ 100 మంది సభ్యులను చేర్పించాలనే లక్ష్యంతో లక్నో మహానగర బృందం పనిచేస్తోందంటూ బిజెపి శ్రేణులను అభినందించారు సీఎం యోగి. 

బూత్ ఎన్నికల కురుక్షేత్రం

ఎన్నికల్లో పోటీ జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కాదు.., బూత్ స్థాయిలో ఉంటుందన్నారు యోగి. ఇలా బూత్ గెలిస్తేనే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని ప్రధాని మోదీ అంటుంటారని సిఎం యోగి గుర్తు చేశారు. బూత్ బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయం దక్కుతుందని... ఈ ప్రాథమిక అంశాన్ని దృష్టిలో పెట్టుకునే బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ సభ్యత్వ ప్రచార కార్యక్రమం వేగంగా కొనసాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, మేయర్ సుషమా ఖర్క్‌వాల్, రాజ్యసభ సభ్యుడు బ్రిజ్‌లాల్, ఎమ్మెల్యే నీరజ్ బోరా, ఎమ్మెల్సీ ముఖేష్ శర్మ, రామ్‌చంద్ర ప్రధాన్, లాల్జీ ప్రసాద్ నిర్మల్, మాజీ మంత్రి మోహసిన్ రజా, బిజెపి మహానగర్ అధ్యక్షుడు ఆనంద్ ద్వివేది, పార్షద్ సుశీల్ తివారీ, బూత్ అధ్యక్షుడు మనీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఐదుగురికి బిజెపి సభ్యత్వం కల్పించిన సిఎం

సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఐదుగురికి సిఎం యోగి బిజెపి సభ్యత్వం కల్పించారు. దేశం, రాష్ట్రం, బూత్ స్థాయిలో బిజెపి నిర్దేశించుకున్న లక్ష్యాలను పార్టీ కార్యకర్తలు సులభంగా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్నో మహానగరంలో ఇప్పటివరకు 2,52,494 మందికి బిజెపి సభ్యత్వం కల్పించినట్లు తెలిపారు.

click me!