దేశంలో యోగి ఆదిత్యనాథ్ దే అగ్రస్థానం : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్

By Arun Kumar PFirst Published Sep 25, 2024, 9:20 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2024ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. యోగి పాలనలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటోందని అన్నారు. 

గ్రేటర్ నోయిడా : ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కార్ అభివృద్ది చేస్తూనే సంక్షేమ పాలన అదిస్తోందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కొనియాడారు. దేశంలోనే అతిపెద్దది, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో సుపరిపాలన సాగుతోందని అన్నారు. ఇలా సీఎం యోగి గేమ్ చేంజర్ గా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి. 

యోగి పాలన కేవలం యూపీకే కాదు  దేశానికి కూడా ఎంతో మేలు చేసేలా వుందన్నారు ఉపరాష్ట్రపతి. నిరంతరం ప్రజలకోసమే తాపత్రయపడుతూ ఆయన పనిచేసే విధానం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటుందని అన్నారు. 

Latest Videos

ఇవాళ (బుధవారం) ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ఏర్పాటుచేసిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2024 ను ప్రారంభించారు.  జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వివిధ హాల్‌లలో ఏర్పాటు చేసిన స్టాల్‌లను ఉపరాష్ట్రపతి తిలకించారు.   

 సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు

యూపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్ అన్నారు. ఇక్కడి స్టాల్స్ పరిశీలించిన తర్వాత తాను ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఉన్నట్లు అనిపించిందని అన్నారు. ''ఈ కార్యక్రమం రాష్ట్రంలోని కళాకారులు, చేతివృత్తులవారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఇంత దార్శనికత, దూరదృష్టి, ఆచరణాత్మక ఆలోచన  కలిగిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు'' అని ఉపరాష్ట్రపతి కొనియాడారు.

వియత్నాంతో భారత్ కు సత్సంబంధాలు :

దక్షిణాసియాలో అత్యధిక జీడీపీ కలిగిన దేశం వియత్నాం ...ఇలాంటి అభివృద్ది చెందిన దేశం యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (రెండవ ఎడిషన్‌) 'పార్ట్‌నర్ కంట్రీ'గా పాల్గొనడం పట్ల   సంతోషకరమని ఉపరాష్ట్రపతి అన్నారు.  భారతదేశం, ఉత్తర ప్రదేశ్ తో పాటు వియత్నాం యొక్క గొప్ప సంస్కృతిని కూడా మనం ఇక్కడ చూడవచ్చని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా వున్నాయి...ఈ ట్రేడ్ షో  ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.  

యూపీ వేగంగా అభివృద్ది చెందుతోంది 

ఈ ట్రేడ్ షో ద్వారా రాష్ట్రంలోని సాంకేతిక, సాంస్కృతిక వారసత్వాన్నే కాదు ఒక జిల్లా-ఒక ఉత్పత్తి వంటివాటి ద్వారా సాధించిన అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య పాలనా వ్యవహారాల్లో మంచి సమన్వయం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. సీఎం యోగి నిరంతర కృషితో యూపీ వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు.

సుపరిపాలనలో యోగిదే అగ్రస్థానం 

ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతను భారతీయులు కలిగివున్నారు... కానీ విదేశీ పాలన కారణంగా మనం ఎంతో కోల్పోయామన్నారు ఉపరాష్ట్రపతి. అయితే ఇప్పుడు మనం దానికి తిరిగి ఊపిరి పోశాం... దీనికంటే సంతృప్తికరమైన విషయం మరొకటి లేదన్నారు. సుపరిపాలన విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉన్నారని ఉపరాష్ట్రపతి అన్నారు. 

అన్ని రంగాల్లోనూ ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి 

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, ఆవిష్కరణలతో యూపీ కళకళలాడుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. రెండేళ్లలో మన ఆర్థిక వ్యవస్థ జర్మనీ, జపాన్‌లను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎం యోగి కృషితో రాష్ట్రంలో ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు బలమైన మౌలిక సదుపాయాలుగా కనిపిస్తున్నాయన్నారు.

ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 కొత్త పారిశ్రామిక ప్రాంతాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.    ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మనల్ని ప్రశంసిస్తున్నాయన్నారు. మన దేశ డిజిటలైజేషన్, సాంకేతికత చాలా అద్భుతమన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దశాబ్దకాలంగా వివిధ రంగాలలో సానుకూల ఫలితాలు వచ్చాయి... ఇందులో యూపీ ముందంజలో ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.

యూపీ ఇప్పుడు దేశానికి చాలా పెద్ద బలం: ధన్‌ఖర్

ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక నేపథ్యం ఉన్న రాష్ట్రం... కానీ ఇక్కడి పరిస్థితుల కారణంగా గతంలో అభివృద్ధి అవకాశాలు తక్కువగా ఉండేవని గుర్తుచేసారు. కానీ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు చాలా వేగంగా దూసుకుపోతోంది... ఈ మార్పు ఊహించనిదని అన్నారు. ఒకరకంగా యూపీ పూర్తిగా పునరుజ్జీవనం పొందింది... అవినీతి అనేది ఇప్పుడు యూపీలో గతం అని అన్నారు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఇప్పుడు దేశానికి చాలా పెద్ద బలంగా మారిందన్నారు.

ప్రతి రంగంలోనూ యోగి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది

2027 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షను యూపీ కలిగి ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. మౌలిక సదుపాయాలపై ఇక్కడ భారీగా దృష్టి సారించడం దీనిని శక్తివంతమైన రాష్ట్రంగా మారుస్తుంది. వీటన్నింటిలోనూ యోగి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. యూపీ స్థూల దేశీయోత్పత్తిలో నోయిడా 10 శాతం వాటాను అందించింది. ఈ నగరం నైపుణ్యంతో నిండి ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధికి చోదక శక్తి,  దేశాన్ని ముందుకు నడిపించడానికి వేగంగా దూసుకుపోతోంది. యోగి ఆదిత్యనాథ్ దార్శనికత తనను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు.

ఇది కేవలం ప్రదర్శన కాదు, అందరికీ అవకాశాల వేదిక

ఇది కేవలం ప్రదర్శన కాదని, అందరికీ అవకాశాల వేదిక అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమం 'ఆత్మనిర్భర్ భారత్', 'లోకల్ టు గ్లోబల్' అనే నినాదాలను సాకారం చేసేది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని నెరవేర్చడానికి దేశంలో చాలా పెద్ద యజ్ఞం జరుగుతోందని, దీనిలో మనమందరం కూడా పాలుపంచుకోవాలని ఆయన అన్నారు.

 

 70 దేశాల భాగస్వామ్యం, 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం

గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో రెండో ఎడిషన్ జరుగుతోంది. ఇందులో రక్షణ, వ్యవసాయం, ఈ-కామర్స్, ఐటీ, జీఐ, విద్య, మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, పాడి పరిశ్రమ మొదలైన వాటికి చెందిన 2,500 స్టాల్‌లు ఏర్పాటు చేశారు. MSME రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వరుసగా రెండో ఏడాది ఈ ట్రేడ్ షోను నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది UPITSలో 70 దేశాలు పాల్గొంటున్నాయి, 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా UPITSలో ఖాదీ దుస్తుల ఫ్యాషన్ షో, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ట్రేడ్ షోలో రాష్ట్ర ఎగుమతిదారులు, ODOP, మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దీంతో చిన్న పారిశ్రామికవేత్తలకు గ్లోబల్ షోకేస్ లభిస్తుంది.

click me!