
న్యూఢిల్లీ: ఏ కంపెనీలోనైనా డ్యూటీలో పడుకోవడం చూస్తే బాస్ కోపగించుకుంటాడు. కనీసం విసుక్కుంటాడు. కానీ, స్వయంగా బాసే ఉద్యోగులను ఉద్దేశించి డ్యూటీలో మీరు పడుకోవడం చూడాలనుందని అని అంటే నివ్వెరపోక తప్పదు కదూ. బెంగళూరులోని ఓ కంపెనీ ఇలాంటి షాకింగ్ కాదు.. కాదు.. బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీ ఉద్యోగులు డ్యూటీ సమయంలోనే రోజు ఒక అరగంట పడుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, పడుకోవడానికి ప్రత్యేకంగా 30 నిమిషాల సమయాన్ని కేటాయించింది. అంతటితో ఆగిపోలేదు.. ఆ అరగంటైనా కునుకు తీయడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అనౌన్స్ చేసి ఉద్యోగులనే కాదు.. బయటి వారిని సైతం ఆశ్చర్యంలో ముంచేసింది.
డ్యూటీ అవర్స్‌లోనూ ఓ పవర్ న్యాప్ తీసి మళ్లీ ప్రవహించే ఉత్సాహాన్ని పొందాలని ఏ ఉద్యోగికి ఉండదు. ఈ ఆలోచననే కాదు.. నాసా, హర్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాలను పేర్కొంటూ బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ‘పవర్ న్యాప్’ ప్రకటన చేశారు.
వేక్ ఫిట్ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగే గౌడ తన ట్విట్టర్ అకౌంట్‌లో రెండు ఇమేజ్‌లను పోస్టు చేశారు. అందులో ఆయన ఇటీవలే కంపెనీ ఉద్యోగులకు ఇంటర్నల్‌గా పంపిన మెయిల్, మరొకటి పవర్ న్యాప్ ఒక హక్కుగా పేర్కొంటూ దానికి సమయాన్ని కేటాయించిన రూల్స్‌ను ట్వీట్ చేశారు.
స్లీప్ బిజినెస్‌లో సుమారు ఆరేళ్ల నుంచి తాము ఉంటున్నామని, కానీ, రెస్ట్‌కు సంబంధించిన ఆఫ్టర్‌నూన్ న్యాప్ సదుపాయాన్ని కల్పించడంలో తాము ఫెయిల్ అయ్యామని పేర్కొన్నారు. నాసా అధ్యయనం ప్రకారం 26 నిమిషాల నిద్ర పని ప్రదర్శనను 33 శాతం మెరుగుపరుస్తుందని, హార్వర్డ్ అధ్యయనం కూడా మనిషిని ఉల్లాసపరుస్తుందని తెలిపిందని వివరించారు.
అంతేకాదు, ప్రతి ఉద్యోగి ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 గంటల వరకు కునుకు తీసుకోవచ్చని, ప్రతి ఉద్యోగికి ఇది ఒక హక్కు అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఉద్యోగికి ఎలాంటి టాస్క్‌లు ఉండవని వివరించారు. అంతేకాదు, పడుకోవడానికి అనువైన న్యాప్ పాడ్స్ ఏర్పాటు చేస్తామని, నిశ్శబ్దంగా ఉండే రూములనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, ఈ ప్రకటనపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.