ఢిల్లీలో ఊహించని పరిణామం: రేపు సోనియాతో భేటీకి షెడ్యూల్.. అంతలోనే మోడీతో మమతా బెనర్జీ సమావేశం

By Siva KodatiFirst Published Jul 27, 2021, 4:22 PM IST
Highlights

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. అలాగే రేపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనూ మమతా బెనర్జీ సమావేశం కానున్నారు

బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో వున్న పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు మమతా. రాష్ట్రానికి అందాల్సిన వరద సాయంపైనా చర్చించే అవకాశం వుంది. అలాగే రేపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనూ మమతా బెనర్జీ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించనున్నారు. 

మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మమత చొరవ చూపడం ప్రారంభించారు. తాజాగా అమరవీరుల ర్యాలీ పేరిట దీదీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధానమైన విపక్ష పార్టీలన్నీ భాగస్వామ్యం వహించాయి. కాంగ్రెసు, సమాజ్ వాదీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జెడీ , డీఎంకే వంటి పార్టీల నాయకులు ఢిల్లీ నుంచి ఆన్ లైన్ లో పాల్గొన్నారు. పలుపార్టీల ఐక్య కూటమికి ఇదో ముందడుగుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు యునైటెడ్ ప్రంట్ ఏర్పాటుకు శరద్ పవార్ చొరవ తీసుకోవాలంటూ మమత అభ్యర్థించారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు సమయం ఆసన్నమైందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విపక్షనేతలకు సూచించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రధాని మోడీతో దీదీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది

click me!