బస్సులు, లోకల్ రైళ్లు రద్దు.. కర్ఫ్యూ తరహా ఆంక్షలు: కరోనాపై దీదీ యాక్షన్

By Siva Kodati  |  First Published May 5, 2021, 8:34 PM IST

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా కట్టడిపై దృష్టి పెట్టారు మమతా బెనర్జీ. అఖండ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఆమె గెలుపు సంబరాలను పక్కనపెట్టి వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు


పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా కట్టడిపై దృష్టి పెట్టారు మమతా బెనర్జీ. అఖండ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఆమె గెలుపు సంబరాలను పక్కనపెట్టి వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు దీదీ. గురువారం నుంచి లోకల్‌ రైళ్లను రద్దు చేస్తున్నామని.. అలాగే మెట్రో, బస్సులు 50 శాతం ఆక్సూపెన్సీతో నడపాలని సీఎం ఆదేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో నిర్వహించాలని మమత ఆదేశించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్‌లు సహా జనం రద్దీగా ఉండే అన్నింటినీ మూసేయాలని సూచించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ మాత్రమే మార్కెట్లు, దుకాణాలు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని మమతబెనర్జీ అధికారులను ఆదేశించారు.  

Latest Videos

undefined

Also Read:బెంగాల్ డీజీపీ నీరజ్ నయాన్‌ బదిలీ: సీఎంగా ప్రమాణం చేసిన గంటల్లోనే నిర్ణయం

ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్‌కు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ చూపించాలని.. అది కూడా 72గంటలు దాటి ఉండకూడదని తెలిపారు. రైలు ప్రయాణికులు సహా అన్ని రకాల ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని సీఎం చెప్పారు.  మార్కెట్లు, దుకాణాల్లో రద్దీని తగ్గించేందుకు గాను ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, హోం డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని దీదీ సూచించారు.

ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా ప్రైవేటు కార్యాలయాలు కూడా 50 శాతంతోనే నిర్వహించాలని మమత విజ్ఞప్తి చేశారు. జ్యువెలరీ షాపులు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ తెరిచి ఉంచవచ్చని.. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి 2 వరకూ మాత్రమే పనిచేసేలా చూడాలని మమత బెనర్జీ అధికారులను ఆదేశించారు.

click me!