కరోనాపై ప్రజలకు సేవలు... చివరికి ఆ మహమ్మారికే బలి

By Siva KodatiFirst Published Jul 14, 2020, 4:21 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు దీని బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు మరణించారు కూడా. అయినప్పటికీ పోలీసులు, డాక్టర్లు, అధికార యంత్రాంగం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.

భారతదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు దీని బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు మరణించారు కూడా. అయినప్పటికీ పోలీసులు, డాక్టర్లు, అధికార యంత్రాంగం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ అధికారిని కరోనా పొట్టనబెట్టుకుంది.

పశ్చిమ బెంగాల్‌లో వైరస్‌పై విశేషంగా సేవలందించిన దేబ్ దత్తా రే (38) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణంతో సహోద్యోగాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తీభవించిన మానవత్వంతో, క్లిష్ట వ్యవహారాలను కూడా సునాయాసంగా పరిష్కరించడంలో ఆమె సునిశిత శైలిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

హుగ్లీ జిల్లా , చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా దేబ్ దత్తా విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ అనుమానిత లక్షణాలతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెరాంపూర్‌లోని శ్రమ జీబీ ఆసుపత్రికి తరలించారు.

అయితే పరిస్ధితి విషమించడంతో సోమవారం ఉదయం దేబ్ దత్తా కన్నుమూశారు. ఈమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మరోవైపు దేబ్ దత్తా ఆకస్మిక మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ మహమ్మారిపై పోరులో ప్రజలకు విశేష సేవలందించారని సీఎం ప్రశంసించారు. దేబ్ దత్తా మరణం తీరని లోటని .. ప్రభుత్వం తరపున, ఆమె సేవలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. కాగా కోవిడ్ 19తో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనాతో మరణించడం బెంగాల్‌లో ఇదే తొలిసారి.

click me!