బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలి: మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్‌

Published : Feb 21, 2022, 02:57 PM IST
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలి: మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్‌

సారాంశం

Nawab Malik: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి కాంగ్రెస్‌తో సహా  బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్  అన్నారు.  దీనికి సంబంధించిన ప్రక్రియ  ఆదివారమే షురూ అయ్యాయని తెలిపారు.   

Nawab Malik: దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా రాజ‌కీయాలు క‌దులుతున్నాయి. దీని కోసం ఇప్ప‌టికే కాంగ్రెస్ ను కాద‌ని మ‌రో ప్ర‌తిప‌క్ష కూటమిని ఏర్పాటు చేసే దిశ‌గా బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం బీజేపీకి వ్య‌తిరేకంగా ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే దేశంలోని బీజేపీయేత‌ర ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఇదే విష‌యంపై చ‌ర్చించారు. ఆదివారం నాడు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే తో క‌లిసి దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత ఎన్సీపీ అధినేత శ‌రద్ ప‌వార్ తో కూడా సీఎం కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన వివిధ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆయా స‌మావేశాలతో ముందుకు సాగుతున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల ముందు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి కాంగ్రెస్‌తో సహా  బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. "TRS చీఫ్, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, NCP అధినేత శరద్ పవార్ జీని కలిశారు. దేశ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి గతంలో తృణ‌మూల్ అధినేత్రి మమతా దీదీ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చారు" అని తెలిపారు.  శ‌ర‌ద్ ప‌వార్ తో కేసీఆర్ స‌మావేశంలోని చ‌ర్చ‌ల గురించి మాట్లాడిన న‌వాబ్ మాలిక్‌.. 2024 సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు, అన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క‌టిగా ఏర్పడతాయని తెలిపారు. “బీజేపీ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్‌తో సహా ఏకం కావాలనీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రజల ముందు ప్రత్యామ్నాయం చూపాలని పవార్ జీ సమావేశంలో అన్నారు. ఈ ప్రక్రియ నిన్ననే ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ (మోర్చా) ఏర్పాటు చేస్తాం" అని తెలిపారు. 

కాగా, మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాల ప‌ట్ల కేంద్రంలోని మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అన్ని పార్టీలు ఆగ్ర‌హంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్య‌తిరేక ప్ర‌తిప‌క్ష ఫ్రంట్ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్‌... ఉద్ధ‌వ్ థాక్రే, శ‌రద్ ప‌వార్ ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ ఐక్యత ప్రక్రియను ఈ సమావేశం వేగవంతం చేస్తుందని శివసేన అధికార పత్రిక 'సామ్నా' ఆదివారం పేర్కొంది. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంపై గ‌త కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టి రెచ్చిపోతున్నారు. బీజేపీని ఈ దేశం నుంచి త‌రిమికొట్టాల‌నీ, లేకుంటే దేశం నాశ‌నం అవుతుందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని అధికారం నుంచి గద్దె దించేందుకు రాజకీయ శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలవనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌